Nirmala Sitharaman: భారత ఆర్థిక వ్యవస్థ ముందు అతిపెద్ద సవాలు ఉపాధి కల్పన- నిర్మలా సీతారామన్

by Shamantha N |
Nirmala Sitharaman: భారత ఆర్థిక వ్యవస్థ ముందు అతిపెద్ద సవాలు ఉపాధి కల్పన- నిర్మలా సీతారామన్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత ఆర్థిక వ్యవస్థ ముందు ఉన్న అతి పెద్ద సవాలు ఉపాధి కల్పన అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) అన్నారు. కొలంబియా యూనివర్సిటీలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న నిర్మలా సీతారామన్.. ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధి సహా పలు అంశాలపై మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ నూతన వృద్ధి అవకాశాలు అందిపుచ్చుకోవడంలో భారత్ మెరుగైన స్థానంలో ఉందన్నారు. దేశీయంగా సమర్థత పెంచుకోవడంతో పాటు.. బయటి నుంచి వచ్చే సవాళ్లను తట్టుకునేలా ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దాలను భావిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత్‌లోని పెట్టుబడి అవకాశాల గురించి ఆమె ప్రస్తావించారు. ఉపాధి కల్పనే దేశం ముందున్న అతిపెద్ద సవాలన్నారు. ‘‘చాలా మంది యువత డిగ్రీ పట్టాలతో బయటకు వస్తున్నారు. కానీ, తమకున్న అర్హతకు, సాధించిన ఉద్యోగానికి మధ్య వ్యత్యాసం ఉందని వారు భావిస్తున్నారు. ఈ లోటును భర్తీ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. కృత్రిమ మేధ (AI) వంటి సాంకేతికతల్లో నైపుణ్యాన్ని అందించేందుకు యువతను సన్నద్ధం చేస్తోంది’’ అని ఆర్థిక మంత్రి అన్నారు.

యూపీఐ గురించి..

సదస్సులో యూనిఫైడ్ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) గురించి నిర్మలాసీతారామన్ ప్రస్తావించారు. ప్లాస్టిక్‌ కార్డుల నుంచి క్యూఆర్‌ కోడ్‌కు వేగంగా దేశం మారినట్లు ఆమె తెలిపారు. చిరు దుకాణాలు, కూరగాయల కోసం కూడా దీనిని వాడుతున్నామని అన్నారు. దీంతో, చెల్లింపులు మరింత పారదర్శకంగా మారాయని, నగదుపై ఆధారపడటం తగ్గిందన్నారు. థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ నుంచి సోలార్ పవర్ వంటి రెన్యువబుల్ ఎనర్జీ వైపునకు భారత్ వేగంగా మారుతోందన్నారు.

Advertisement

Next Story

Most Viewed