Waqf Bill: లోక్ సభలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై రగడ

by Shamantha N |
Waqf Bill: లోక్ సభలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై రగడ
X

దిశ, నేషనల్ బ్యూరో: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్ సభలో ప్రవేశపెట్టారు. దీని ద్వారా వక్ఫ్‌ పాలకవర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతూ పాలనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేయనున్నారు. ఈ మేరకు 1995 నాటి వక్ఫ్‌ చట్టంలో దాదాపు 40 సవరణలు జరిగాయి. ముస్లిం సమాజం నుంచి వస్తున్న డిమాండ్ల మేరకే ఈ మార్పులు చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. కొత్త బిల్లు అమలులోకి వస్తే జిల్లా కలెక్టర్లు రూపొందించిన వాస్తవ అంచనా విలువల మేర వక్ఫ్‌ బోర్డులు తమ ఆస్తులను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఈ సవరణ బిల్లును బీజేపీ మిత్రపక్షాలు సమర్థించాయి. కానీ, దీనిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి.

ప్రతిపక్షాల విమర్శలు

బీజేపీ ప్రభుత్వం ఎప్పట్నుంచో ఈ సవరణల గురించి ఆలోచిస్తోందని, ఇది సరైన నిర్ణయం కాదని ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని వ్యతిరేకించింది. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధం అంటూ కాంగ్రెస్ ఖండించింది. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ..‘‘ ఈ బిల్లు దారుణం. రాజ్యాంగ స్ఫూర్తిపై దాడి. ఇది మతపరమైన విభజనను సృష్టిస్తుంది’’ అని విమర్శించారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. 'వక్ఫ్ బోర్డు' సవరణలన్నీ కూడా కేవలం ఒక సాకు మాత్రమే. కాషాయ పార్టీ రియల్ ఎస్టేట్ కంపెనీలా పనిచేస్తోందన్నారు. బీజేపీ అంటే భారతీయ జమీన్ పార్టీ అని విమర్శించారు. రక్షణ, రైల్వేలు, నాజుల్ ల్యాండ్ వంటి భూములను విక్రయించడమే బీజేపీ లక్ష్యమని ఆరోపించారు. 'బీజేపీ ప్రయోజనాల కోసం పథకం' అనే దాంట్లో ఇది మరో లింక్ మాత్రమే అన్నారు. వక్ఫ్‌బోర్డు భూములు అమ్మబోమని రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఎస్పీ ఎంపీ ఏమన్నారంటే?

సమాజ్ వాదీ పార్టీ ఎంపీ మొహిబుల్లా మాట్లాడుతూ.. ఈ బిల్లు ముస్లింలను లక్ష్యంగా చేసుకోబోతోందని అన్నారు. వక్ఫ్ ఆస్తుల బోర్డులో హిందూ సోదరులను చేర్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. హిందువులు, ముస్లింలు లేదా ఏ మతానికి చెందిన వారైనా తమ సంస్థలను నిర్వహించుకునే హక్కు ఉందన్నారు. ఈ బిల్లు తీసుకురావడం ద్వారా మనమే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేందుకు ప్రయత్నిస్తున్నామని మండిపడ్డారు. ఇదే లాజిక్ అయితే సౌదీ అరేబియాలోని కాబా కమిటీలో హిందువులను కూడా చేర్చుకుంటారా? అని ప్రశ్నించారు. ప్రజలు తమ హక్కులను కాపాడుకునేందుకు మళ్లీ వీధుల్లోకి రాకూడదని భావిస్తున్నా అని అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story