లైంగిక వేధింపుల కేసులో పోలీసుల సమన్లను పట్టించుకోవద్దు..

by S Gopi |
లైంగిక వేధింపుల కేసులో పోలీసుల సమన్లను పట్టించుకోవద్దు..
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సి.వి.ఆనంద బోస్‌ తనను లైంగికంగా వేధించారంటూ రాజ్‌భవన్‌లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగి చేసిన ఫిర్యాదుపై కోల్‌కతా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో గవర్నర్ ఆదివారం రాజ్ భవన్ సిబ్బందికి ప్రత్యేక లేఖ రాశారు. తనపై మోపబడిన వేధింపుల ఆరోపణలకు సంబంధించి పోలీసుల నుంచి వచ్చే సమన్లను పట్టించుకోవద్దని కోరారు. తన పదవీ కాలంలో గవర్నర్‌పై ఎలాంటి క్రిమినల్‌ చర్యలు చేపట్టరాదని రాజ్‌భవన్‌ సిబ్బందికి చెప్పారు. ఆదివారం రాజ్‌భవన్ సిబ్బందికి రాసిన లేఖలో గవర్నర్ బోస్.. 'ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టాలని, రాజ్‌భవన్ సిబ్బందిని విచారించనున్నట్టు మీడియా నుంచి వచ్చిన నివేదికలు వచ్చాయి. రాజ్‌భవన్‌లోని సీసీటీవీ ఫుటేజీని సేకరించాలని దర్యాప్తు బృందం భావిస్తున్నట్లు సమాచారం. భారత రాజ్యాంగంలోని 361(2), (3) ప్రకారం ఇలాంటి వ్యవహారాల్లో గవర్నర్‌కు మినహాయింపు ఉంది. ఆర్టికల్ ప్రకారం, రాష్ట్రపతి లేదా రాష్ట్ర గవర్నర్‌పై వారి పదవీ కాలంలో ఏ కోర్టులోనైనా క్రిమినల్ ప్రొసీడింగ్‌లు ప్రారంభించబడవు లేదా కొనసాగించబడవు. కాబట్టి, పోలీసులు ఈ విషయాన్ని ఏ విధంగానైనా దర్యాప్తు/విచారణ చేయలేరు. ఈ పరిస్థితుల్లో రాజ్‌భవన్ సిబ్బంది పోలీసుల నుంచి వచ్చే సమన్లు, సమాచారాన్ని పట్టించుకోవద్దు. అలాగే ఆఫ్‌లైన్, ఆన్‌లైన్, వ్యక్తిగతంగా, ఫోన్ ఇంకా ఏ మార్గంలోనైనా సరే ఎలాంటి ప్రకటనలు చేయవద్దూ అని పేర్కొన్నారు. కాగా, శనివారం ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన కోల్‌కతా పోలీసులు శనివారం రాజ్‌భవన్‌కు చెందిన నలుగురు ఉద్యోగులను పిలిపించి విచారణ జరిపారు. రాజ్‌భవన్‌కు చెందిన సీసీటీవీ కెమేరా ఫుటేజీలను ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ తాజా నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed