Bansuri Swaraj : లోక్ సభ ప్రతిపక్ష నేత మారే చాన్స్.. బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్

by vinod kumar |   ( Updated:2024-10-11 12:44:38.0  )
Bansuri Swaraj : లోక్ సభ ప్రతిపక్ష నేత మారే చాన్స్.. బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ ఎంపీ బన్సూరీ స్వరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ప్రతిపక్ష నేతను మార్చే యోచనలో ఇండియా కూటమి ఉందన్నారు. ప్రతిపక్ష పార్టీల్లో ఈ హోదా నిర్వర్తించడానికి చాలా మంది సమర్థులైన నాయకులు ఉన్నారన్నారు. రాహుల్ గాంధీ పనితీరు బాగా లేదని ఇండియా కూటమి భావిస్తే మార్పు చేయొచ్చని తెలిపారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ప్రతిపక్ష నేత పదవిని రొటేషన్‌గా మార్చాలనే చర్చ కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది విపక్షాల అంతర్గత వ్యవహారం. ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించడానికి వారిలో సమమర్థవంతమైన నాయకులు ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు. రాహుల్ తన బాధ్యతను పూర్తి అంకితభావంతో నిర్వర్తించలేకపోతున్నారని ఆరోపించారు.

బన్సూరీ వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నాయకుడు మనోజ్ యాదవ్ స్పందిస్తూ.. రాహుల్ గాంధీ పనితీరుపై బీజేపీ వైఖరిని తప్పుపట్టారు. రాహుల్ గాంధీ తన పాత్రను సక్రమంగా నిర్వహిస్తున్నారో లేదో బీజేపీ ఎలా చెప్పగలదని ప్రశ్నించారు. స్వరాజ్ వ్యాఖ్యలు రాజకీయ ప్రేరేపితమై ఉండొచ్చని తెలిపారు. రాహుల్ గాంధీపై దాడి చేయడం ద్వారా ఆమె తన స్థాయిని పెంచుకోవచ్చని భావిస్తుండొచ్చని చెప్పారు. మరోవైపు ఒక ప్రముఖ న్యాయవాది రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడటం సిగ్గుచేటని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ విమర్శించారు. కాగా, సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా అవతరించడంతో రాహుల్ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా నియమితులయ్యారు.

Advertisement

Next Story