Baba Siddique : బాబా సిద్దిఖీ హత్య కేసులో మరో నిందితుడి అరెస్ట్

by Hajipasha |
Baba Siddique : బాబా సిద్దిఖీ హత్య కేసులో మరో నిందితుడి అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఎన్‌సీపీ అజిత్ పవార్ వర్గం నేత బాబా సిద్దిఖీ హత్య కేసుపై దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులు మరో నిందితుడిని అరెస్టు చేశారు. హర్యానాలోని కైథాల్‌‌ నగరం నథ్వాన్ పట్టి ఏరియాకు చెందిన అమిత్ హిసాంసింగ్ కుమార్‌(29)ను బుధవారం అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 11కు పెరిగింది. అంతకుముందు ఆదివారం రోజు నవీ ముంబైకు చెందిన స్క్రాప్ డీలర్ భగ్వత్ సింగ్ ఓంసింగ్‌ను అరెస్టు చేశారు. అతడు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వాస్తవ్యుడు.

నవీ ముంబైలో ఉంటూ స్క్రాప్ బిజినెస్ చేస్తున్నాడు. భగ్వత్ సింగ్ ఇచ్చిన తుపాకీతోనే ఓ దుండగుడు బాబా సిద్దిఖీపై కాల్పులు జరిపాడని పోలీసులు విచారణలో గుర్తించారు. ఈనెల 12న ముంబైలో బాబా సిద్దిఖీని ముగ్గురు షూటర్లు హత్య చేశారు. అయితే గుర్మయిల్ బల్జీత్ సింగ్ (23), ధర్మరాజ్ రాజేష్ కశ్యప్ (19)లను అరెస్టు చేయగా.. మరో షూటర్ శివకుమార్ గౌతం పరారీలో ఉన్నాడు. ఈ హత్యకు కుట్రపన్నిన ఇంకో ఇద్దరు వ్యక్తులు కూడా పరారీలో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed