Delhi Liquor Policy Case: మనీలాండరింగ్ కేసులో మరో కీలక పరిణామం..

by Vinod kumar |
Delhi Liquor Policy Case: మనీలాండరింగ్ కేసులో మరో కీలక పరిణామం..
X

న్యూఢిల్లీ : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత మనీష్ సిసోడియా, ఆయన భార్య సీమాతో పాటు ఇంకొందరు నిందితులకు చెందిన దాదాపు రూ.52.24 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) శుక్రవారం అటాచ్ చేసింది. అటాచ్ చేసిన వాటిలో సిసోడియా దంపతులకు చెందిన రెండు స్థిరాస్తులు, రూ.11.49 లక్షల బ్యాంక్ డిపాజిట్లతో పాటు బ్రిండ్‌ కో సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని అమన్‌దీప్ సింగ్ ధాల్ కు చెందిన రూ. 16.45 కోట్ల చరాస్తులు ఉన్నాయి. రాజేష్ జోషి(చారియట్ ప్రొడక్షన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యజమాని), గౌతమ్ మల్హోత్రా (పంజాబ్‌కు చెందిన మద్యం వ్యాపారి) సహా ఇంకొందరు నిందితులకు చెందిన రూ.44.29 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు కూడా అటాచ్ చేసిన ఆస్తుల జాబితాలో ఉన్నాయని ఈడీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఈ కేసులో సిసోడియాను మార్చిలో ఈడీ అరెస్టు చేయగా.. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. బెయిల్ కోసం గురువారం సుప్రీంకోర్టును సిసోడియా ఆశ్రయించగా చుక్కెదురైంది. ఇది జరిగిన మరుసటి రోజే ఆస్తుల అటాచ్ మెంట్ జరగడం గమనార్హం. మరోవైపు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన సీబీఐ కేసులో అప్రూవర్ గా మారిన దినేష్ అరోరాను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఆయనను శుక్రవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా నాలుగు రోజుల ఈడీ కస్టడీకి పంపుతూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది.

దినేష్ అరోరా.. జైలులో ఉన్న ఆప్ నేత మనీష్ సిసోడియాకు సన్నిహితుడు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ జరిగినప్పుడు ఢిల్లీ డిప్యూటీ సీఎం పదవి, ఎక్సైజ్ మంత్రిత్వ శాఖ రెండూ మనీష్ సిసోడియా చేతిలో ఉన్నాయి. అప్పుడు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని తమకు అనుకూలంగా తయారు చేసేలా మనీష్ సిసోడియా సహా పలువురు ఢిల్లీ ప్రభుత్వ పెద్దలను ప్రలోభ పెట్టేందుకు ‘సౌత్ గ్రూప్’ అనే లిక్కర్ లాబీ పైరవీలు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలో ‘సౌత్ గ్రూప్’, ఆమ్ ఆద్మీ పార్టీ నేతల మధ్య ఆర్థిక లావాదేవీలు దినేష్ అరోరా ద్వారానే జరిగాయని ఈడీ తన ఛార్జిషీట్‌లలో ఆరోపించింది.

Advertisement

Next Story

Most Viewed