ట్రయల్‌ కోర్టులో బెయిల్‌‌ పిటిషన్ ఎందుకు వేయలేదో చెప్పిన కేజ్రీవాల్

by Hajipasha |
ట్రయల్‌ కోర్టులో బెయిల్‌‌ పిటిషన్ ఎందుకు వేయలేదో చెప్పిన కేజ్రీవాల్
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘‘ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్‌ కోసం ట్రయల్ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారా ?’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం సీఎం కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీని ప్రశ్నించింది. దీంతో ఆ కోర్టులో బెయిల్ ఎందుకు దాఖలు చేయలేదని వివరాలను లాయర్ వివరించారు. తన అరెస్టు, కస్టడీని సవాల్‌ చేస్తూ అరవింద్‌ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ సోమవారం విచారణ జరిపింది. ‘‘ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 2023 డిసెంబరు వరకు నమోదైన సీబీఐ ఛార్జిషీట్లు, ఈడీ అభియోగాలలో ఎక్కడా కేజ్రీవాల్ పేరును ప్రస్తావించలేదు. తీరా సార్వత్రిక ఎన్నికల సమయంలో మనీలాండరింగ్ అభియోగాలతో వచ్చి ఆయన్ను ఈడీ అరెస్టు చేసింది. అరెస్ట్ చేసే అధికారం ఉంది కదా అని అరెస్టు చేయకూడదు. చేసిన నేరమేంటో చెప్పి, దాన్ని నిరూపించాలని మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 45 చెబుతోంది’’ అని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదించారు. ‘‘కనీసం కేజ్రీవాల్‌ను ప్రశ్నించకుండా.. సెక్షన్ 50 స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయకుండానే అరెస్టు చేయడం అన్యాయం’’ అని ఆయన పేర్కొన్నారు.

కేజ్రీవాల్ అరెస్టు రాజకీయ ప్రేరేపిత చర్య

‘‘కేజ్రీవాల్ అరెస్టు రాజకీయ ప్రేరేపిత చర్య. దర్యాప్తు సంస్థలను వాడుకొని రాజకీయ ప్రత్యర్థులను కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందనడానికి ఈ కేసు ప్రధాన ఉదాహరణ’’ అని న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ చెప్పారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ‘‘ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్‌ కోసం ట్రయల్ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారా ?’’ అని కేజ్రీవాల్ లాయర్‌ను ప్రశ్నించింది. ‘‘ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్‌ అరెస్టు అక్రమం. అందుకే ఆయన ఎలాంటి బెయిల్ పిటిషన్లు వేయలేదు. దిగువ కోర్టులో మధ్యంతర ఉపశమనం కోసం ఒక పిటిషన్ మాత్రమే వేశారు. సమన్లకు హాజరుకాలేదన్న కారణంతో సీఎం హోదాలో ఉన్న నేత ఇంటికొచ్చి ఈడీ అరెస్టు చేయడం సరికాదు’’ అని అభిషేక్‌ మను సింఘ్వీ ధర్మాసనానికి చెప్పారు. ‘‘విస్తృత అధికార పరిధి ఉన్నందునే కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు’’ అని ఆయన తెలిపారు. ఇక ఈ వాదనలను ఈడీ తరఫు న్యాయవాది కౌంటర్ చేశారు. ‘‘కేజ్రీవాల్‌ మాకు అస్సలు సహకరించలేదు. అందుకే ఆయన్ను అరెస్టు చేయాల్సి వచ్చింది. తొమ్మిదిసార్లు సమన్లు పంపినా కేజ్రీవాల్ తప్పించుకు తిరిగారు. చివరకు పీఎంఎల్‌ఏలోని సెక్షన్ 17 కింద స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసేందుకు కూడా ఆయన సహకరించలేదు’’ అని సుప్రీంకోర్టు బెంచ్‌కు ఈడీ లాయర్ తెలిపారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

Advertisement

Next Story