తిహార్ జైలులో సీఎం కేజ్రీవాల్ సరెండర్

by Hajipasha |
తిహార్ జైలులో సీఎం కేజ్రీవాల్ సరెండర్
X

దిశ, నేషనల్ బ్యూరో: లిక్కర్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం మధ్యాహ్నం తిహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోయారు. అంతకుముందు ఆయన మధ్యాహ్నం 3 గంటలకు తన నివాసం నుంచి బయలుదేరి రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అక్కడి నుంచి నేరుగా కన్నాట్ ప్లేస్‌‌కు వెళ్లి హనుమాన్ ఆలయాన్ని దర్శించుకొని పూజలు చేశారు. పూజల అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయానికి వెళ్లి కార్యకర్తలు, పార్టీ నేతలను కలిశారు. తిహార్ జైలుకు కేజ్రీవాల్ వెళ్లిన అనంతరం అధికారులు ఆయనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట హాజరుపరిచారు. కేజ్రీవాల్‌‌‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించాలని ఈసందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది కోరారు. అయితే జూన్ 5 వరకు జ్యుడీషియల్ కస్టడీని విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కొందరు ఈవీఎంలను మార్చడానికి ట్రై చేస్తున్నారు : కేజ్రీవాల్

తిహార్ జైలులో సరెండర్ అయ్యేముందు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ‘‘మధ్యంతర బెయిల్‌పై బయటికి రావడంతో ఎన్నికల ప్రచారంలో నా ప్రయత్నాలు ఫలించాయి. 21 రోజుల్లో ఒక్క నిమిషం కూడా వృథా చేయలేదు. ఇండియా కూటమి తరఫున ముమ్మరంగా ప్రచారం చేశా. దేశ ప్రయోజనాలకే నా తొలి ప్రాధాన్యత. ఆ తర్వాతే ఆమ్‌ ఆద్మీ పార్టీ’’ అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందన్నారు. ‘‘25 పార్లమెంట్ స్థానాలున్న రాజస్థాన్‌లో బీజేపీ 33 సీట్లు గెలుస్తోందని ఓ సర్వే సంస్థ చెప్పింది. అది ఎలా సాధ్యం. ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అనడానికి ఈ ఘటనే బెస్ట్ ఎగ్జామ్‌పుల్’’ అని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ఫలితాల విడుదలకు మూడు రోజుల ముందే తప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వాల్సిన అవసరం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు పూర్తి భిన్నంగా కౌంటింగ్ రోజున రిజల్ట్స్ వస్తాయని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. కొందరు ఈవీఎంలను మార్చడానికి ట్రై చేస్తున్నారని ఆయన బిగ్ బాంబ్ పేల్చారు.

Advertisement

Next Story