Article 370: ఆర్టికల్ 370పై కాంగ్రెస్-ఎన్సీ వైఖరితో ఏకీభవిస్తున్నాం.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

by vinod kumar |
Article 370: ఆర్టికల్ 370పై కాంగ్రెస్-ఎన్సీ వైఖరితో ఏకీభవిస్తున్నాం.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్టికల్ 370పై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370కి సంబంధించిన విషయంలో కాంగ్రెస్- నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) కూటమి వైఖరితో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఏకీభవిస్తుందని తెలిపారు. తాజాగా ఆయన ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్సీ కూటమి విజయం సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. కశ్మీర్‌లో ఆర్టికల్ 370, 35A పునరుద్దరించే విషయంలో పాకిస్థాన్, కాంగ్రెస్-ఎన్సీ కూటమి ఓకే వైఖరితో ఉన్నాయని స్పష్టం చేశారు. కశ్మీర్‌లో మొదటి దశ ఎన్నికలు పూర్తైన నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం.

ఆసిఫ్ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే వారివైపే నిలుస్తుందని మండిపడింది. ‘పాకిస్థాన్ ఒక ఉగ్రదేశం. కశ్మీర్‌పై కాంగ్రెస్, ఎన్సీ వైఖరిని సమర్థిస్తుంది. గురుపత్వంత్ పన్నూన్ నుంచి పాక్ వరకు, రాహుల్, కాంగ్రెస్ నిరంతరం భారతదేశ ప్రయోజనాలకు విరుద్ధమైన వారి వైపు ఎలా నిలుస్తారు? అని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. కాగా, ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని ఎన్సీ హామీ ఇవ్వగా, కాంగ్రెస్ ఈ అంశంపై మౌనంగా ఉంది. దానిని తన ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చలేదు. అయితే, కశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని పలుమార్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలు ప్రధాన్యత సంతరించుకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed