Amit Shah : ఇందిరాగాంధీ, నెహ్రూ వల్లే ‘జమిలి’కి బ్రేక్ పడింది : అమిత్‌ షా

by Hajipasha |
Amit Shah : ఇందిరాగాంధీ, నెహ్రూ వల్లే ‘జమిలి’కి బ్రేక్ పడింది : అమిత్‌ షా
X

దిశ, నేషనల్ బ్యూరో : జమిలి ఎన్నికల(One Nation One Election) విధానం కొత్తదేమీ కాదని.. గతంలోనూ ఈ విధానాన్ని మన దేశం అనుసరించిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా(Amit Shah) గుర్తు చేశారు. 1952లో దేశంలో అన్ని ఎలక్షన్స్‌ ఒకేసారి జరిగాయని.. మొత్తం మూడు సార్లు జమిలి ఎన్నికలను నిర్వహించారని ఆయన తెలిపారు. కేరళలోని సీపీఐ(ఎం) ప్రభుత్వాన్ని నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కూల్చేసినప్పటి నుంచి జమిలి ఎన్నికల ప్రక్రియ మరుగున పడిందన్నారు. ‘‘ఎన్నికల్లో గెలవాలనే ఏకైక ఉద్దేశంతో 1971లో ఇందిరాగాంధీ లోక్‌సభ గడువు ముగియకముందే రద్దుచేశారు. అప్పటి నుంచి దేశంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరుగుతున్నాయి’’ అని అమిత్‌షా పేర్కొన్నారు.

వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ విధానంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవికత లేదన్నారు. జమిలి ఎన్నికల వల్ల దేశానికి లాభమే తప్ప నష్టం జరిగే ప్రసక్తే ఉండదని చెప్పారు. ప్రజాధనాన్ని, సమయాన్ని, మానవ వనరులను ఆదా చేయాలంటే జమిలి ఎన్నికలే సరైన మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘జమిలి ఎన్నికల విధానంలో భాగంగా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో కూలిపోతే.. ఐదేళ్లలో మిగిలిన కాలం కోసమే ఆ అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ గడువు ముగిసిన తర్వాత లోక్‌సభతో పాటే అన్ని శాసనసభలకు జమిలి ఎన్నికలు జరుగుతాయి’’ అని అమిత్‌షా వివరించారు. జమిలి ఎన్నికల వల్ల దేశంలోని సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలుగుతుందనే ప్రచారం ముమ్మాటికీ అబద్ధమేనన్నారు.

Advertisement

Next Story

Most Viewed