Sharmila : వైఎస్ జగన్ పై షర్మిల ఫైర్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-15 08:19:36.0  )
Sharmila :  వైఎస్ జగన్ పై షర్మిల ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల(YS Sharmila)మరోసారి తన సోదరుడు వైసీసీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy)పై ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. తమకు 25 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా చేస్తానని చెప్పి జగన్‌ ప్రజలకు తీరని అన్యాయం చేశారని అన్న జగన్ పై షర్మిల మండిపడ్డారు. విభజన హామీలు బుట్టదాఖలు చేయడంలో ప్రధాన ముద్దాయి మోడీ, రెండో ముద్దాయి చంద్రబాబు, మూడో ముద్దాయి జగన్‌ అని విమర్శించారు. 2019 ఎన్నికల్లో తమకు 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదాను ఎందుకు ఇవ్వదో చూస్తానంటూ శపథాలు చేసిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు.

హోదా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఇస్తామని మోడీ నమ్మబలికితే.. హోదా ఏమైనా సంజీవనా అని చంద్రబాబు చెవుల్లో పూలు పెట్టారని, 25 మంది ఎంపీలు ఇస్తే హోదా ఎందుకు ఇవ్వరో చూస్తా అని శపథాలు చేసిన జగన్ రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేశారని దుయ్యబట్టారు. విజన్ 2047 పేరుతో సీఎం చంద్రబాబు మళ్ళీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని..ఆంధ్రప్రదేశ్ దశ దిశ మారాలంటే తక్షణం కావాల్సింది విజన్లు కాదు.. విభజన హామీలు అని అని షర్మిల పేర్కొన్నారు.

రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలపాలంటే నెరవేరాల్సింది కేంద్రం ఇచ్చిన హామీలేనని స్పష్టం చేశారు. ఎప్పటికైనా రాష్ట్ర అభివృద్ధికి సంజీవని ప్రత్యేక హోదా మాత్రమేనని, హోదాతోనే రాష్ట్రానికి విజన్ అని షర్మిల అభిప్రాయ పడ్డారు. మోడీ పిలక మీ చేతుల్లో ఉన్నందునా విభజన హామీలపై ప్రధానిని నిలదీసి, కేంద్రం గల్లా పట్టి రాష్ట్ర హక్కులను సాధించాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబును డిమాండ్ చేస్తుందని షర్మిల పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed