Maoists: ఆ ఎన్‌కౌంటర్ బూటకం.. వారు గ్రామీణులే.. లేఖ విడుదల చేసిన మావోయిస్టులు

by Ramesh N |   ( Updated:2024-12-15 08:18:39.0  )
Maoists: ఆ ఎన్‌కౌంటర్ బూటకం.. వారు గ్రామీణులే.. లేఖ విడుదల చేసిన మావోయిస్టులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఛత్తీస్‎గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా అబూజ్‌మడ్‌లోని అటవీప్రాంతంలో ఈ నెల 12న భారీ ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. అయితే నారాయణపూర్ ఎన్‌కౌంటర్ (Narayanpur encounter) బూటకమని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఈ మేరకు Communist Party of India (Maoist) డివిజనల్ కమిటీ పేరిట ఓ లేఖ విడుదల చేసింది. ఏడుగురు మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నది పూర్తిగా అబద్ధమని, ఇది ఎన్‌కౌంటర్ కాదని స్పష్టంచేసింది. మృతులు ఏడుగురిలో ఐదుగురు గ్రామీణులు ఉన్నారని తెలిపింది. ఈ నెల 10 నుంచి 13 వరకు నారాయణపూర్ జిల్లా మాడ్ డివిజన్‌లోని ఇంద్రావతి ప్రాంతంలో కాగర్ ఆపరేషన్‌లో భాగంగా సుమారు 4వేల మంది పోలీసులు, పారా మిలటరీ సిబ్బందితో మళ్లీ పెద్ద దమనకాండ నిర్వహించారని తెలిపింది.

11వ తేదీ ఉదయం 11 గంటల ప్రాంతంలో లకేవేద పెండలో వ్యవసాయం చేస్తున్న వారిని చుట్టుముట్టిన పోలీసులు వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారని పేర్కొంది. ఇందులో ముగ్గురు లేదా నలుగురు గ్రామీణులు చనిపోయారని, ఏడుగురు గాయపడ్డారని వెల్లడించింది. చాలామందిని పట్టుకుని తీసుకెళ్లారని వెల్లడించింది. మరోవైపు ఈ నెల 12న కుమ్మం అడవిలో అనారోగ్యంతో ఉన్న పీఎల్‌జీఏ సభ్యుడు కార్తీక్ దాదా(62), అతడి సహాయకుడు రమీలను పోలీసులు చుట్టుముట్టి కాల్చి చంపారని పేర్కొంది. ప్రణాళికాబద్ధంగా ఈ మారణకాండ జరిపారని లేఖలో పేర్కొంది. ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed