15 నెలల్లో రూ. 2.7 కోట్లు సంపాదించిన మాజీ డీపీఐఐటీ అధికారి

by S Gopi |
15 నెలల్లో రూ. 2.7 కోట్లు సంపాదించిన మాజీ డీపీఐఐటీ అధికారి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన అనంతరం పరిశ్రమల ప్రోత్సాహక శాఖ (డీపీఐఐటీ) మాజీ కార్యదర్శి రమేష్‌ అభిషేక్‌కు చెందిన ఇల్లు, ప్రాంగణాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. 'రమేష్ అభిషేక్ డీపీఐఐటీ కార్యదర్శిగా ఉన్నప్పుడు లావాదేవీలు జరిపిన వివిధ సంస్థల నుంచి రిటైర్‌మెంట్ తర్వాత కన్సల్టింగ్, ఇతర మార్గాల్లో పెద్ద మొత్తాలను వసూలు చేసినట్టు' సీబీఐ ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. బీహార్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రమేష్ అభిషేక్ పదవీ విరమణ తర్వాత సర్వీసులో ఉన్నప్పుడు అధికారిక లావాదేవీలు జరిపిన డజనుకు పైగా కంపెనీల నుంచి కన్సల్టింగ్ ఫీజు రూపంలో కోట్లాది రూపాయలు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన ఈడీ, సీబీఐతో పాటు ఇతర ఏజెన్సీల విచారణను ఎదుర్కొంటున్నారు. ఈడీ తెలిపిన వివరాల ప్రకారం, అభిషేక్ అఫిడఫిట్‌లో పదవీ విరమణ తర్వాత 15 నెలల కాలంలోనే రూ. 2.7 కోట్ల ఫీజులను పొందారు. ఇది తను చివరగా డ్రా చేసిన జీతం(రూ. 2.26 లక్షల) కంటే 119 రెట్లు ఎక్కువ. డీపీఐఐటీలో సెక్రటరీగా నియమితులైనప్పుడు ఆయన కనీసం 16 కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించినట్టు వివిధ ఏజెన్సీల విచారణలో వెల్లడైందని సీబీఐ సీనియర్ అధికారి చెప్పారు. అలాగే, ఢిల్లీలోని పురాతన గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడం అనుమానాస్పదంగా ఉందని సీబీఐ పేర్కొంది. రమేష్ అభిషేక్ 2016 నుంచి 2019 వరకు డీపీఐఐటీ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఫార్వార్డ్ మార్కెట్ కమిషన్ ఛైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆర్‌బీఐ ఆంక్షలను ఎదుర్కొంటున్న పేటీఎంలోని ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లలో రమేష్ అభిషేక్ కూడా ఒకరు.

Advertisement

Next Story