మూడోవిడత ‘పోల్’ సంగ్రామానికి సర్వం సిద్ధం

by Hajipasha |
మూడోవిడత ‘పోల్’ సంగ్రామానికి సర్వం సిద్ధం
X

దిశ, నేషనల్ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా మూడో విడత పోలింగ్‌‌ను మంగళవారం నిర్వహించనున్నారు. ఈ ఓట్ల పండుగకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.మూడో విడత ఎన్నికలో భాగంగా 95 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగాల్సి ఉండగా, సూరత్‌ సీటు బీజేపీకి ఏకగ్రీవమైంది. జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ-అనంత్‌నాగ్‌ లోక్‌సభ నియోజకవర్గం పోలింగ్‌ను రవాణాపరమైన అవాంతరాల కారణంగా ఆరో విడతకు వాయిదా వేశారు. ఫలితంగా మూడో విడతలో 93 లోక్‌సభ సీట్లకే పోలింగ్ జరుగుతోంది. గుజరాత్‌లోని 25 స్థానాలు, కర్ణాటకలోని 14 స్థానాలు, మహారాష్ట్రలోని 11 స్థానాలు, ఉత్తరప్రదేశ్‌లోని 10 స్థానాలు, మధ్యప్రదేశ్‌లోని 9 స్థానాలు, ఛత్తీస్‌గఢ్‌లోని 7 స్థానాలు, బెంగాల్‌లోని 4 స్థానాలు, గోవాలోని రెండు స్థానాలు, దాద్రా నగర్ హవేలీ, డామన్‌డయ్యులోని రెండు స్థానాలు, బిహార్​లోని 5, అసోంలోని 4 స్థానాలకు మంగళవారమే ఓటింగ్‌ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది.

అమిత్‌ షా నియోజకవర్గం.. మోడీ ఓటు

గుజరాత్‌లోని గాంధీనగర్‌ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మరోసారి పోటీ చేస్తున్నారు. ఆయన ప్రత్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ సోనాల్‌ పటేల్‌ను బరిలోకి దింపింది. ఈ నియోజకవర్గంలోనే ప్రధాని నరేంద్ర మోడీ ఓటరుగా ఉన్నారు. పోర్‌బందర్‌ నుంచి కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ, రాజ్‌కోట్‌లో మరో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా పోటీ చేస్తున్నారు.

కర్ణాటకలో దిగ్గజ నేతలు..

కర్ణాటకలోని ధార్వాడ నుంచి ఇప్పటికే 3 సార్లు గెలిచిన బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి నాలుగోసారి పోటీ చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థి వినోద్‌ అసూటీతో తలపడుతున్నారు. మరో కేంద్ర మంత్రి భగవంత్ ఖుబా బీదర్ నుంచి మరోసారి పోటీకి నిలిచారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు బసవరాజ్ బొమ్మై హవేరీ స్థానంలో, జగదీష్ షెట్టార్‌ బెల్గాంలో అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

మహారాష్ట్రలో రసవత్తర పోరు

మరాఠా రాజకీయ కురువృద్ధుడు శరద్‌ పవార్‌ కుటుంబానికి కంచుకోటలాంటి బారామతిలో ఆయన కుమార్తె సుప్రియా సూలేపై మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ సతీమణి సునేత్రా పవార్‌ పోటీకి దిగడం వల్ల పోరు రసవత్తరంగా మారింది. సుప్రియా సూలే కొత్త గుర్తుతో పోటీ చేస్తుండటం పోటీని మరింత కఠినంగా మార్చింది. రాజవంశానికి చెందిన షాహు ఛత్రపతి కాంగ్రెస్ అభ్యర్థిగా కొల్హాపూర్‌ నుంచి మరో రాజవంశస్థుడు ఉదయన్‌ రాజే భోసలే బీజేపీ అభ్యర్థిగా సతారా నుంచి పోటీలో ఉన్నారు. రత్నగిరి-సింధ్‌దుర్గ్ స్థానంలో కేంద్ర మంత్రి నారాయణ్ రాణె పోటీ చేస్తున్నారు.

యూపీ బరిలో ములాయం ఫ్యామిలీ

ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీపార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులు పోటీలో ఉండడం వల్ల అందరి దృష్టి వారిపైనే ఉంది. మెయిన్‌పురి నుంచి అఖిలేష్‌ యాదవ్‌ సతీమణి డింపుల్‌ యాదవ్‌ మరోసారి పోటీ చేస్తున్నారు. ములాయం సింగ్ యాదవ్ మరణంతో 2022లో జరిగిన ఉపఎన్నికలో డింపుల్ యాదవ్ 2.88 లక్షల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి రఘురాజ్‌సింగ్‌పై గెలిచారు. డింపుల్‌పై ఈసారి బీజేపీ యూపీ పర్యటక మంత్రి జయవీర్ సింగ్‌ను నిలిపింది. ఫిరోజాబాద్‌ నుంచి ఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌గోపాల్ యాదవ్‌ తనయుడు అక్షయ్ యాదవ్‌ మరోసారి పోటికి దిగారు. బదాయూ లోక్‌సభ స్థానం నుంచి శివపాల్ యాదవ్‌ కుమారుడు ఆదిత్య యాదవ్ తొలిసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

30 ఏళ్ల తర్వాత లోక్‌సభ బరిలో దిగ్విజయ్‌

మధ్యప్రదేశ్‌‌లోని గుణ నుంచి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పోటీ చేస్తున్నారు. 2019లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన ఆయన లక్షకుపైగా ఓట్ల తేడాతో తన రాజకీయ జీవితంలో తొలిసారి ఓటమి పాలయ్యారు. తర్వాత బీజేపీలో చేరి కేంద్ర మంత్రి అయ్యారు. ఒకప్పటి బీజేపీ అగ్రనేత, 2023లోకాంగ్రెస్‌లో చేరిన రావ్‌ యాదవేంద్ర సింగ్‌ యాదవ్‌తో సింధియా ఈసారి తలపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ విదిశ నుంచి పోటీ చేస్తున్నారు. రాజ్‌గడ్‌లో కాంగ్రెస్‌ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. 30 ఏళ్ల తర్వాత దిగ్విజయ్‌ సింగ్‌ లోక్‌సభ బరిలో నిలిచారు.

బద్రుద్దీన్‌ అజ్మల్‌‌కు గట్టి సవాలు

అసోంలోని ధుబరీ నుంచి ఆల్‌ ఇండియా యునైటెడ్‌ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ అధ్యక్షుడు బద్రుద్దీన్‌ అజ్మల్‌ పోటీ చేస్తున్నారు. 2009 నుంచి ఇక్కడ గెలుస్తున్న బద్రుద్దీన్‌కు ఈ ఎన్నికల్లో ఎదురుగాలి వీస్తోంది. డీలిమిటేషన్‌లో భాగంగా ముస్లింలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాలను వేరే పార్లమెంట్‌ స్థానంలో కలపడం వల్ల ఈసారి ఆయనకు గట్టి సవాలు ఎదురవుతోంది. కానీ క్షేత్రస్థాయిలో బద్రుద్దీన్‌కు మంచిపేరు ఉండడం కలిసి వచ్చే అంశం.

ఎన్నికల బరిలో రూ.1361 కోట్ల ఆస్తిపరురాలు

గోవాలో ఉన్న రెండు లోక్‌సభ స్థానాలైన ఉత్తర గోవా, దక్షిణ గోవా స్థానాలకు ఈ దశలోనే ఎన్నికలు జరగనున్నాయి. గోవాలోని ప్రముఖ పారిశ్రామిక కుటుంబం నుంచి వచ్చిన పల్లవి డెంపో దక్షిణ గోవా నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. రూ.1361 కోట్ల ఆస్తులున్న ఆమె మూడో విడతలో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. గోవాలో తొలిసారిగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్న మహిళగా డెంపో నిలిచారు.

Advertisement

Next Story