బైడెన్ దంపతులకు మోడీ అద్భుతమైన గిఫ్ట్స్..

by Vinod kumar |
బైడెన్ దంపతులకు మోడీ అద్భుతమైన గిఫ్ట్స్..
X

వాషింగ్టన్ : అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్‌ దంపతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అద్భుతమైన గిఫ్ట్స్ ఇచ్చారు. భారత సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఓ విలువైన గంధపుచెక్క పెట్టెను అమెరికా అధ్యక్షుడికి బహూకరించారు. కర్ణాటకలోని మైసూరు నుంచి తెప్పించిన గంధపు చెక్కతో రాజస్థాన్ కు చెందిన కళాకారులు ఈ పెట్టెను తయారు చేశారు. ఇందులో 'సహస్ర చంద్ర దర్శనం' అని రాసి ఉంచిన కార్డు, వెండితో తయారు చేసిన దీపపు కుందె, వినాయకుడి చిన్న విగ్రహాన్ని ఉంచారు. వినాయకుడి చిన్న విగ్రహాన్ని, దీపపు కుందెను బెంగాల్ లో తయారు చేయించారు. ఈ గంధపు చెక్కపెట్టెను బైడెన్ దంపతులకు అందజేసి, అందులో ఉన్న వస్తువుల వివరాలను మోడీ వారికి వివరించారు. వెయ్యి పౌర్ణములు చూసిన దంపతులకు దశదానాలు చేసే సంప్రదాయంలో భాగంగా వేర్వేరు రాష్ట్రాల నుంచి తెప్పించిన 10 వస్తువులను బైడెన్‌కు దానంగా మోడీ అందజేశారు.

వీటితో పాటు టెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఉపనిషత్ పుస్తకాన్ని బహూకరించారు. అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు 7.5 క్యారెట్ల ఆకుపచ్చ వజ్రాన్ని మోడీ ఇచ్చారు. ఈ డైమండ్‌ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ల్యాబ్‌లో రూపొందించారు. ఈ వజ్రాన్ని ఉంచిన చిన్నబాక్సును కూడా ప్రత్యేకంగా రూపొందించారు. పేపర్‌ గుజ్జుతో తయారు చేసిన ఈ పెట్టెపై కశ్మీరీ కళాకారులు విభిన్న డిజైన్‌లను వేశారు. భారత్ కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 7.5 క్యారెట్ల ఆకుపచ్చ వజ్రాన్ని మోడీ ఇచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed