Vijay: తమిళనాట కొత్త పొత్తు? టీవీకేతో జట్టుకు అన్నాడీఎంకే రెడీ!

by Mahesh Kanagandla |
Vijay: తమిళనాట కొత్త పొత్తు? టీవీకేతో జట్టుకు అన్నాడీఎంకే రెడీ!
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు రాజకీయాల్లో జయలలిత మరణం తర్వాత డీఎంకేకు బలమైన పోటీదారు లేకుండా పోయింది. శశికళ కొంత నష్టాన్ని అరికట్టినా.. పళనిస్వామి నాయకత్వంలో ఏఐఏడీఎంకే అంతకంతకూ దిగజారిపోతున్నది. గత లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. ఈ తరుణంలో యాక్టర్ విజయ్.. తమిళగ వెట్రి కళగం పార్టీ తొలి ప్లీనరీ సమావేశంలో డీఎంకేను లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. లక్షలాది మంది హాజరైన ఆ సమావేశంలో డీఎంకే భావజాలాన్ని, అన్నాదురై ఒకే కులం, ఒకే దైవం అనే మాటను ఖండిస్తూ ఏఐఏడీఎంకే లైన్‌ను పాటించారు. విభజన రాజకీయాలు అంటూ పరోక్షంగా బీజేపీని కూడా విమర్శించిన విజయ్.. ఏఐఏడీఎంకేను పల్లెత్తుమాట అనలేదు. వచ్చే ఎన్నికల్లో టీవీకే సొంతంగా పోటీ చేయగలదని, అవసరమైతే పొత్తులకూ సిద్ధమేనని విజయ్ స్పష్టం చేశారు. గత లోక్ సభ ఎన్నికలతో బీజేపీతో పొత్తును తెంచుకున్న ఏఐఏడీఎంకే.. డీఎంకేకు బలమైన ప్రత్యర్థి మారే అవకాశమున్న టీవీకేతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. నిజానికి టీవీకే భావజాలం అన్ని పార్టీల ఆలోచనలను కాపీ కొట్టినట్టున్నదని మరుసటి రోజే ఏఐఏడీఎంకే నాయకులు విమర్శించారు. కానీ, ఏఐఏడీఎంకే అధిష్టానం మనసులో మాత్రం టీవీకేతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచన ఉన్నదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్‌ను, టీవీకేను విమర్శించరాదని ఏఐఏడీఎంకే పార్టీ ప్రతినిధులకు, నాయకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. టీవీకేతో పొత్తు పెట్టుకుంటే అన్నా డీఎంకేకు కలిసివచ్చే అవకాశం ఉంటుందని పార్టీ నాయకులు కొందరు తెలిపారు. తమిళనాడులో మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed