నాడు శివసేన.. నేడు ఎన్సీపీ.. శరద్ పవార్ పార్టీలో చీలిక

by Vinod kumar |
నాడు శివసేన.. నేడు ఎన్సీపీ.. శరద్ పవార్ పార్టీలో చీలిక
X

దిశ, వెబ్‌డెస్క్: మరాఠా గడ్డపై మరో రాజకీయ పార్టీ చీలిపోయింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్ పై మేనల్లుడు, పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్ తిరుగుబాటు చేశారు. ఆదివారం (జులై 2) మధ్యాహ్నం ఆయన 30 మంది ఎన్‌సీపీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంలో చేరారు. డిప్యూటీ సీఎంగా అజిత్, 9 మంది ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర సీఎంగా ఉన్న ఏక్ నాథ్ షిండే.. సరిగ్గా ఏడాది క్రితం శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ థాక్రే పై తిరుగుబాటు చేశారు.

ఆయన 2022 జూన్ 30న మహారాష్ట్ర సీఎంగా ప్రమాణం చేశారు. ఇది జరిగిన ఏడాది వ్యవధిలోనే శివసేన తరహాలో ఎన్‌సీపీ చీలిపోవడం.. ఏక్ నాథ్ షిండే స్టైల్ లోనే అజిత్ పవార్ తిరుగుబాటు చేయడం గమనార్హం. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దేశంలోనే అత్యధిక లోక్ సభ స్థానాలు కలిగిన రాష్ట్రాల్లో ఒకటైన మహారాష్ట్రలో చోటుచేసుకున్న ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పశ్చిమ మహారాష్ట్రలో ముగ్గురు ఎంపీలు, 27 మంది ఎమ్మెల్యేల బలం కలిగిన ఎన్సీపీ చీలిక వర్గం చేరికతో బీజేపీ కూటమి మరింత బలోపేతం కానుంది.

మ్యాజిక్ 36పై అజిత్ ఫోకస్..

మహారాష్ట్ర అసెంబ్లీలో పార్టీల బలాబలాలను పరిశీలిస్తే.. 2019 ఎన్నికల్లో మొత్తం 288 స్థానాలకుగానూ బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54 స్థానాల్లో గెలిచాయి. ఎన్‌సీపీకి చెందిన మొత్తం 54 మంది ఎమ్మెల్యేల్లో 30 మంది అజిత్ పవార్‌తో కలిసి బీజేపీ కూటమిలోకి జంప్ అయ్యారు. ఒకవేళ మూడింట రెండు వంతుల మంది ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు తన వెంటే ఉన్నారని గవర్నర్ ఎదుట అజిత్ పవార్‌ నిరూపించుకోలేకపోతే.. దీన్ని పార్టీ ఫిరాయింపుగా పరిగణిస్తారు. ఈ లెక్కన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలను తప్పించుకోవాలంటే.. అజిత్ పవార్‌కు కనీసం 36 మందికిపైగా ఎన్‌సీపీ ఎమ్మెల్యేల (మూడింట రెండు వంతుల మంది) మద్దతు అవసరం. ఇప్పటికే 30 మంది ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు అజిత్ వెంట ఉండగా.. త్వరలో మరో 10 మంది ఆయన వెనుక వెళ్లే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి.

మహారాష్ట్ర కేబినెట్‌లో ఇప్పుడు బీజేపీ నుంచి 9 మంది మంత్రులు, శివసేన నుంచి 9 మంది, ఎన్సీపీ నుంచి 9 మంది మంత్రులు, ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. రాష్ట్ర కేబినెట్‌ లో గరిష్టంగా 43 మంది సభ్యులు ఉండొచ్చు. ఎన్సీపీ చేరికతో ఇప్పుడిది 30కి చేరింది. అంటే ఇంకో 13 మందిని మంత్రులుగా చేయొచ్చన్న మాట. అజిత్ పవార్ మ్యాజిక్ నంబర్ "36" కోసం త్వరలో మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరనున్న మరో 10 మంది ఎన్‌సీపీ ఎమ్మెల్యేలలో చాలామందికి మంత్రి పదవులు కేటాయించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, "ప్రభుత్వంలోకి ఎన్సీపీ చేరికతో ఇప్పుడు మాది ట్రిపుల్ ఇంజన్ సర్కారుగా మారింది. అజిత్ పవార్ చేరికతో మహారాష్ట్ర మరింత బలపడుతుంది. మహారాష్ట్ర అభివృద్ధి కోసమే మేం అజిత్ పవార్, ఆయన వర్గ ఎమ్మెల్యేలను ప్రభుత్వంలోకి ఆహ్వానించాం" అని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే అన్నారు.

శరద్ పవార్‌కు తెలిసే జరిగిందా..?

మహారాష్ట్ర రాజ్ భవన్‌లో ఆదివారం జరిగిన అజిత్ పవార్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న ఎన్సీపీ ముఖ్య నేతల్లో ప్రఫుల్ పటేల్ కూడా ఉన్నారు. ఇటీవల ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్‌ను ప్రఫుల్ పటేల్‌కు శరద్ పవార్ కేటాయించారు. ఎన్సీపీలో కీలక పదవిలో ఉన్న శరద్ పవార్ నమ్మిన బంటు ప్రఫుల్ పటేల్ .. అజిత్ పవార్ తో కలిసి రాజ్ భవన్ కు రావడాన్ని బట్టి ఇదంతా శరద్ పవార్ కనుసన్నల్లోనే జరిగిందా ? అనే అనుమానాలకు తావిస్తోందని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. నెల కిందట (జూన్ 1న గురువారం రాత్రి 10 గంటలకు) మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేతో శరద్ పవార్ భేటీ అయింది ఇందుకోసమేనా అనే చర్చ కూడా నడుస్తోంది.

శివసేన లాగే ఎన్సీపీ చీలుతుందా..?

ప్రస్తుత సీఎం ఏక్ నాథ్ షిండే 2022 జూన్ 21న శివసేన చీఫ్, నాటి సీఎం ఉద్ధవ్ థాక్రే పై తిరుగుబాటును ప్రారంభించారు. డజన్ల కొద్దీ శివసేన ఎమ్మెల్యేలను గుజరాత్‌లోని సూరత్‌లో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్‌ కు తీసుకెళ్లారు. తనకు దాదాపు 38 మంది శివసేన ఎమ్మెల్యేల (మూడింట రెండు వంతుల మంది) మద్దతు ఉందని గవర్నర్ కు ఏక్ నాథ్ తెలిపారు. దీంతో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలతో కూడిన నాటి సర్కారు మెజారిటీ కోల్పోయింది. ఈ తరుణంలో బీజేపీతో ఏక్ నాథ్ చేతులు కలిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎం అయ్యారు. తనదే అసలైన శివసేన పార్టీ అని ఏక్ నాథ్ షిండే క్లెయిమ్ చేసుకున్నారు. అయితే ఆ తర్వాత శివసేన (ఏక్ నాథ్), శివసేన (ఉద్ధవ్) రెండు ముక్కలుగా శివసేన చీలిపోయింది. ఇప్పుడు ఎన్సీపీ కూడా ఇలాగే.. అజిత్ పవార్, శరద్ పవార్ వర్గాలుగా చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story