ఆప్‌ను అబద్దాల పునాదులపై నిర్మించారు: కేజ్రీవాల్‌పై బీజేపీ చీప్ జేపీ నడ్డా ఫైర్

by samatah |   ( Updated:2024-05-18 06:19:19.0  )
ఆప్‌ను అబద్దాల పునాదులపై నిర్మించారు: కేజ్రీవాల్‌పై బీజేపీ చీప్ జేపీ నడ్డా ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను టార్గెట్ చేసేందుకు స్వాతి మలివాల్‌తో కలిసి బీజేపీ కుట్ర పన్నిందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. ఆప్ ఆరోపణలను కొట్టిపారేశారు. ఆప్‌ను అబద్దాల పునాదులపై నిర్మించారని మండిపడ్డారు. ఆ పార్టీకి ఏ మాత్రం విశ్వసనీయత లేదని తెలిపారు. శనివారం ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. దేశ ప్రజల ముందు కేజ్రీవాల్ కుట్ర బహిర్గతమైందన్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో స్వాతి మలివాల్‌పై ప్రశ్నలు అడిగినప్పుడు దానిపై సమాధానం చెప్పడానికి కేజ్రీవాల్ ఎందుకు నిరాకరించారని ప్రశ్నించారు.

ఈ ఘటనకు బీజేపీ కుట్ర పన్నినట్టైతే ఆప్ నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. స్వాతి మలివాల్‌తో ఎప్పుడు మాట్లాడింది కూడా లేదని, ఆమెతో బీజేపీ నాయకులెవరూ సంప్రదింపులు జరపలేదని స్పష్టం చేశారు. ఇది బీజేపీ విధానం కూడా కాదని తెలిపారు. ఆప్ ఏ స్థాయికైనా దిగజారుతుందనడానిని తాజా ఘటనే నిదర్శనమని తెలిపారు. ప్రజలను ఇంటికి పిలిచి కొట్టడం ఆప్ సంస్కృతి అని విమర్శించారు. కాగా, కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్, ఆప్ రాజ్యసభ ఎంపీ, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చీఫ్ మలివాల్‌పై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై స్వాతి పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. అయితే ఈ దాడిలో బీజేపీ ప్రమేయం ఉందని ఆప్ ఆరోపించగా..తాజాగా నడ్డా దానికి కౌంటర్ ఇచ్చారు.

Advertisement

Next Story