ఆప్‌ 4, కాంగ్రెస్‌కు 3: ఢిల్లీలో కుదిరిన పొత్తు!

by samatah |
ఆప్‌ 4, కాంగ్రెస్‌కు 3: ఢిల్లీలో కుదిరిన పొత్తు!
X

దిశ, నేషనల్ బ్యూరో: వరుస షాక్‌లు తగులుతున్న ప్రతిపక్షాల ఇండియా కూటమికి కాస్త ఊరట లభించింది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ల మధ్య ఢిల్లీలో సీట్ల ఒప్పందం ఖరారైనట్టు తెలుస్తోంది. మొత్తం ఏడు లోక్ సభ స్థానాలకు గాను కాంగ్రెస్ 4, ఆప్ 3 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదనకు ఇరు పార్టీలూ అంగీకరించినట్టు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాంగ్రెస్ చాందినీ చౌక్, తూర్పు ఢిల్లీ, ఉత్తర ఢిల్లీ నుంచి పోటీ చేసే చాన్స్ ఉంది. దీనికి గాను హర్యానాలో ఒక సీటు, గుజరాత్‌లో రెండు సీట్లు ఆప్‌కి కాంగ్రెస్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా, ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, కాంగ్రెస్ మధ్య సీట్ షేరింగ్ కొలిక్కిచ్చిన మరుసటి రోజే ఢిల్లీలోనూ సీట్ల సర్ధుబాటు జరగడం గమనార్హం. దీంతో ఇండియా కూటమికి ఈ ఒప్పందం కీలక ముందడుగు అని చెప్పొచ్చు.

పంజాబ్‌లో సయోధ్య కుదిరేనా?

అయితే కాంగ్రెస్-ఆప్‌లు ఢిల్లీలో మాదిరిగానే పంజాబ్‌లోనూ పొత్తు కుదుర్చుకుంటాయని తెలుస్తోంది. కానీ అది సాధ్యం కాకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో అక్కడ పొత్తు ఉంటుందా లేక ఆప్ మాత్రమే అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందా అనే విషయంపై స్పష్టత రాలేదు. అయితే దీనిపైనా త్వరలోనే క్లారిటీ వస్తుందని కాంగ్రెస్, ఆప్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ రాష్ట్రంలో 13 పార్లమెంటు స్థానాలున్నాయి. గతంలో అన్ని స్థానాల్లో ఆప్ పోటీ చేస్తుందని సీఎం భగవంత్ మాన్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇక్కడ సీట్ల సర్ధుబాటు ప్రక్రియపై ఆసక్తి నెలకొంది. మరోవైపు యూపీలో 80 సీట్లకు గాను ఎస్పీ 63, కాంగ్రెస్ 17సీట్లతో పోటీ చేయనున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story