15 ఏళ్ల బాలికపై పదే పదే అత్యాచారం.. ప్ర‌త్యేక కోర్టు ఈ తీర్పిచ్చింది!

by Sumithra |
15 ఏళ్ల బాలికపై పదే పదే అత్యాచారం.. ప్ర‌త్యేక కోర్టు ఈ తీర్పిచ్చింది!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ఎంతో అవ‌గాహ‌న‌, మ‌రెన్నో పోరాటాల త‌ర్వాత ఆడ‌పిల్ల‌ను కూడా క‌నొచ్చ‌ని నేటి త‌రం భావిస్తోంది. తాజాగా భార‌త‌దేశంలో ఇంత‌కుముందు ఎప్పుడూ లేన‌ట్లు స్త్రీ,పురుష నిష్ప‌త్తిలో స్త్రీలే కాస్త ఎక్కువ మంది ఉన్నారు. ఎంత తెలివి పెరుగుతున్నా, ఎన్ని నీతీ నియ‌మాలు క‌నిపిస్తున్నా మ‌నిషి రూపంలో ఉన్న కామాంధులు మాత్రం చెల‌రేగుతూనే ఉన్నారు. ఇలాంటి దుర్మార్గుడే ఆ మ‌ధ్య తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలోనూ దాపురించాడు. అత‌డొక తాపీ మేస్త్రీ, తోటి తాపీ మేస్త్రీ కూతురైన 15 ఏళ్ల బాలికపై పదేపదే అత్యాచారం చేశాడు. సంచ‌ల‌నం సృష్టించిన ఈ కేసులో తాజాగా పోక్సో చట్టం కింద ప్రత్యేక కోర్టు శిక్ష విధించింది.

ఎస్.పాండియరాజన్ అనే నిందితుడు, ఓ మధ్యాహ్నం బాధితురాలు తన ఇంటి ముందు ఆడుకుంటున్నప్పుడు కూల్‌డ్రింక్ ఇస్తాన‌ని బాలిక‌ను త‌న‌ ఇంటికి ఆహ్వానించి, మ‌త్తుమందు క‌లిపిన డ్రింక్ తాగించి, ఆమెపై ప‌లుమార్లు అత్యాచారం చేశాడు. అయితే, బాలిక ఇంటికి రాకపోవడంతో బంధువులు వెత‌క‌డం ప్రారంభించారు. మ‌త్తు నుంచి స్పృహలోకి వచ్చిన తర్వాత బాధితురాలు నొప్పితో క‌ద‌ల్లేక‌, సహాయం కోసం కేకలు వేసింది. ఆమె కేకలు విన్న బంధువులు నిందితుడి ఇంటికి చేరుకునే స‌మ‌యానికి అత‌డు అక్కడి నుండి పారిపోయాడు.

ఇంత‌టి ఘోరమైన అకృత్యానికి పాల్ప‌డిన‌ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. IPC సెక్షన్లు 366(A) (మైనర్ బాలికను స్వాధీనంలోకి తీసుకోవ‌డం), సెక్షన్లు 5(l) (పిల్లలపై పదేపదే లైంగిక వేధింపులకు పాల్పడటం), 6 (తీవ్రమైన లైంగిక వేధింపులకు శిక్ష), 12 (లైంగిక వేధింపులకు శిక్ష) సెక్ష‌న్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, తాజాగా శుక్రవారం అతనికి IPC సెక్షన్ 366(A), POCSO చట్టంలోని సెక్షన్ 6 కింద 10 సంవత్సరాల జైలు శిక్ష, POCSO చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష‌ విధించబడింది. జైలు శిక్షలు వరుసగా అనుభవించాల్సి ఉన్నందున, నిందితుడికి 23 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ సంద‌ర్భంలో న్యాయమూర్తి అతడికి రూ.3,000 జరిమానా విధించి, ప్రాణాలతో బయటపడిన బాధితురాల‌కి రూ.10 లక్షలు పరిహారంగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Advertisement

Next Story