గుజరాత్‌లో భారీ వర్షాలు.. 9 మంది మృతి

by Vinod kumar |
గుజరాత్‌లో భారీ వర్షాలు.. 9 మంది మృతి
X

అహ్మదాబాద్: గుజరాత్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత 30 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. జునాగఢ్, జామ్ నగర్, మోర్బీ, కచ్, సూరత్, తాపీ జిల్లాల్లోని 37 తాలూకాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. తాపీ జిల్లాలోని వ్యారా తాలూకాలో 30 గంటల్లోనే ఏకంగా 299 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. పట్టణాలు, నగరాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

గ్రామాల్లో రోడ్లు కోతకు గురవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గోడ కూలిన ఘటనల్లో పంచ్ మహల్ జిల్లాలో నలుగురు చిన్నారులు, ఆనంద్ లో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. జామ్ నగర్, అర్వల్లి జిల్లాల్లో ఇద్దరు పురుషులు వరదల్లో మునిగి చనిపోయారు. అమ్రేలీ జిల్లా లాఠీ తాలూకాలో ఒక మహిళ వరదలో కొట్టుకొని పోయింది. శనివారం కూడా వివిధ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Advertisement

Next Story