టైం బాంబు పేలుడుతో కలకలం.. సీసీటీవీ ఫుటేజీలో కీలక ఆధారాలు

by Hajipasha |
టైం బాంబు పేలుడుతో కలకలం.. సీసీటీవీ ఫుటేజీలో కీలక ఆధారాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : టైం బాంబు పేలడంతో కర్ణాటక రాజధాని బెంగళూరు శుక్రవారం ఉలిక్కిపడింది. నగరంలోని కుండలహళ్లిలో ఉన్న రామేశ్వరం కేఫ్‌ వద్ద టైం బాంబును ఆగంతకులు పేల్చడంతో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. టిఫిన్‌ బాక్స్‌లో ఐఈడీని అమర్చి టైం బాంబును పేల్చారని సీసీటీవీ కెమెరా ఫుటేజీని బట్టి వెల్లడైంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో రామేశ్వరం కేఫ్‌లోని సింక్‌ వద్ద ఓ ఆగంతకుడు బ్యాగ్‌ను వదిలివెళ్లినట్లు గుర్తించారు. అతడు వెళ్లిపోయాక మధ్యాహ్నం 12.46 గంటలకు బాంబు పేలింది. ఆ బ్యాగ్‌లోని టిఫిన్‌ బాక్సే బాంబు పేలుడుకు కారణమని.. అది ఉగ్రదాడే అయి ఉంటుందని ఎన్‌ఐఏ ప్రాథమిక అంచనాకు వచ్చింది. పేలుడు జరిగిన చోట బోల్టులు, నట్లు, ఎలక్ట్రిక్‌ వైర్లు, వాచ్‌ (టైం బాంబ్‌ కోసం వాడేది)లు లభ్యమయ్యాయి. దీంతో అది టైంబాంబు పేలుడే అని పూర్తి క్లారిటీ వచ్చింది.

ఫోరెన్సిక్‌ టీం సాక్ష్యాలతో..

ఇక రామేశ్వరం కేఫ్‌‌, దాని పరిసరాలను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అదుపులోకి తీసుకొని దర్యాప్తును స్పీడప్ చేసింది. గ్యాస్ సిలిండర్ల వల్ల రామేశ్వరం కేఫ్‌‌లో బ్లాస్ట్ జరిగి ఉంటుందని తొలుత అందరూ భావించారు. అయితే బాంబు స్క్వాడ్‌, ఫోరెన్సిక్‌ టీం సేకరించిన సాక్ష్యాల ఆధారంగా.. అది సాధారణ పేలుడు కాదని, ఉద్దేశపూర్వకంగానే జరిపిన పేలుడే అని తేలింది. కేఫ్‌లోని గ్యాస్ సిలిండర్లు ఏమాత్రం డ్యామేజ్‌ కాలేదని గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని సంఘటనా స్థలాన్ని సందర్శించిన అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు.

పరుగులు తీసిన స్థానికులు..

రామేశ్వరం కేఫ్‌ అంటే బెంగళూరులో చాలా ఫేమస్. ఇక్కడికి రోజూ దాదాపు 5వేల మంది కస్టమర్లు వస్తుంటారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో రామేశ్వరం కేఫ్‌లో భారీ పేలుడు సంభవించింది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్‌ సిబ్బంది అక్కడకు చేరుకుని క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. తొమ్మిది మందిని బ్రూక్‌ఫీల్డ్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వాళ్లందరికీ ప్రాణాపాయం తప్పిందని కర్ణాటక డీజీపీ అశోక్‌ మోహన్‌ వెల్లడించారు. ‘‘రామేశ్వరం కేఫ్‌ వ్యవస్థాపకుడు నాగరాజ్‌తో నేను మాట్లాడాను. పేలుడు గురించి ఆరా తీశాను. ఇది సిలిండర్‌ బ్లాస్ట్‌ కాదు. కస్టమర్‌ ముసుగులో వచ్చిన ఓ వ్యక్తి వదిలేసి వెళ్లిన బ్యాగ్‌ వల్లే పేలుడు జరిగింది. ఇది ముమ్మాటికీ బాంబు పేలుడే’’ అని పేర్కొంటూ కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ట్వీట్‌ చేశారు.

Advertisement

Next Story