'నేను ఇప్పటికీ ప్రభావం చూపిస్తున్నా'.. అజిత్ పవార్‌కు శరద్ పవార్ కౌంటర్

by Vinod kumar |
నేను ఇప్పటికీ ప్రభావం చూపిస్తున్నా.. అజిత్ పవార్‌కు శరద్ పవార్ కౌంటర్
X

న్యూఢిల్లీ: ‘వయస్సు ప్రధానం కాదు.. 82 ఏళ్లు అయినా.. 92 ఏళ్లు అయినా.. పార్టీని నడిపించే సత్తా నాకు ఉంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడిని నేనే’’ అని శరద్ పవార్ అన్నారు. ఎన్సీపీ నిట్టనిలువునా చీలిన నేపథ్యంలో శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ ఎన్సీపీకి చెందిన తన వర్గం ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ‘బీజేపీలో 75 ఏళ్లు పైబడిన నాయకుడికి విశ్రాంతి ఇస్తారు. ఎన్సీపీలో శరద్ పవార్ 82 ఏళ్లు దాటినా పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. ఆయన విశ్రాంతి తీసుకొని పార్టీ పగ్గాలను నాకు అప్పగించాలి’ అని పిలుపునిచ్చారు.

దీనికి కౌంటర్‌గా శరద్ పవార్ గురువారం నిర్వహించిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం తర్వాత పైవ్యాఖ్యలు చేశారు. పార్టీ పేరు, చిహ్నాన్ని ఉపయోగించే హక్కు ఏ వర్గానికి ఉందో ఎన్నికల సంఘం ఇంకా స్పష్టం చేయనందున శరద్ పవార్ నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశానికి చట్టపరమైన గుర్తింపు లేదని అజిత్ పవార్ చెప్పారు. అసలైన ఎన్సీపీ ఎవరికి చెందుతుందో ఎన్నికల సంఘం ప్రకటించే వరకు సమావేశం నిర్వహించినా, నిర్ణయాలు తీసుకున్నా చెల్లుబాటు కాదన్నారు. ఆ నిర్ణయాలకు పార్టీలో ఎవరూ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదన్నారు.

శరద్ పవార్‌ను కలిసిన రాహుల్ గాంధీ..

‘ఆ వాదనలో నిజం లేదు. ఎన్సీపీ నిబంధనల ప్రకారమే సమావేశం జరిగింది. ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తాం. తిరుగుబాటుతో పార్టీకి విఘాతం కలిగింది. దీన్నుంచి బయటపడి ముందుకు సాగుతాం. పార్టీని త్వరలో పూర్వ స్థితికి తీసుకొస్తాం. పార్టీ నాయకులను, కార్యకర్తలను ప్రోత్సహించేందుకే ఈరోజు సమావేశం నిర్వహించాం’ అని శరద్ పవార్ ఘాటుగా జవాబిచ్చారు. అజిత్ పవార్ తో పాటు మంత్రులుగా ప్రమాణం చేసిన 9 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు, వారికి అండగా నిలిచిన ప్రఫుల్ పటేల్, సునీల్ తాత్కరే, ఎస్.ఆర్.కోహ్లీలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తీర్మానం ఆమోదించారు.

పార్టీకి చెందిన 27 రాష్ట్ర యూనిట్లు శరద్ పవార్‌తోనే ఉన్నాయని ఆయన వర్గం నాయకులు చెప్పారు. కాగా.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం సాయంత్రం శరద్ పవార్‌తో సమావేశమయ్యారు. ఆయనకు పూర్తి మద్దతు ప్రకటించిన రాహుల్ మతతత్వ శక్తులతో పోరాటంలో అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

అజిత్ నుంచి జారుకుంటున్న ఎమ్మెల్యేలు..

అయితే.. ఎన్సీపీకి చెందిన మెజారిటీ ప్రజాప్రతినిధులు, వివిధ సంస్థాగత పదవుల్లో పనిచేస్తున్న సభ్యుల అఖండ మద్దతుతో ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు అజిత్ పవార్ జూన్ 30వ తేదీన ప్రకటించుకున్నారు. నిజమైన ఎన్సీపీకి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని, పార్టీ పేరుతో పాటు గుర్తును కూడా తన వర్గానికే కేటాయించాలని కోరుతూ ఎన్నికల సంఘానికి అజిత్ పవార్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలుంటే అజిత్ బుధవారం నిర్వహించిన సమావేశానికి 32 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

కానీ.. పార్టీ పేరు, గుర్తు అజిత్ వర్గానికి కేటాయించాలంటే ఆయనకు కనీసం 36 మంది ఎమ్మెల్యేల (2/3 వంతు) మద్దతు అవసరం ఉంది. అజిత్ కు తొలుత 40 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికినా తర్వాత కొందరు మళ్లీ శరద్ పవార్ శిబిరంలోకి వెళ్లిపోయారు. మరోవైపు.. అజిత్ లేఖ రాసిన విషయాన్ని తమకు ఎందుకు తెలియజేయలేదని ప్రశ్నిస్తూ ఎన్నికల సంఘానికి శరద్ పవార్ లేఖ రాశారు. తాను కేవియట్ పిటిషన్ దాఖలు చేసి ఉన్నందున ఆ సమాచారం తమకు ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed