Kolkata: 'నబన్న అభిజన్' పేరుతో విద్యార్థి సంఘాల నిరసన

by Shamantha N |
Kolkata: నబన్న అభిజన్ పేరుతో విద్యార్థి సంఘాల నిరసన
X

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పలు విద్యార్థి సంఘాలు మంగళవారం 'నబన్న అభిజన్' ( సెక్రటేరియట్ వరకు మార్చ్) పేరుతో నిరసనకు పిలుపునిచ్చాయి. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఈ భారీ ర్యాలీ జరగనుంది. ఈ నిరసన ప్రదర్శనలో హింస చేలరేగే అవకాశం ఉండడంతో కోల్‌కతా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్‌ వద్ద సుమారు 6 వేల మంది పోలీసులతో మూడంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. బారికేడింగ్ కోసం 19 పాయింట్లు ఏర్పాటు చేశారు. దాదాపు 26 మంది డిప్యూటీ కమిషనర్లు వివిధ పాయింట్ల దగ్గర పరిస్థితిని పర్యవేక్షించనున్నారు. హేస్టింగ్స్, ఫర్లాంగ్ గేట్, స్ట్రాండ్ రోడ్, హౌరా సహా ఇతర ప్రదేశాల్లో పెద్ద ఎత్తున బలగాలు మోహరించాయి.

పోలీసులు ఏమన్నారంటే?

విద్యార్థి సంఘాల ముసుగులో.. అరాచక శక్తులు ర్యాలీలో పాల్గొన వచ్చని పోలీసులు సందేహిస్తున్నారు. "నబన్న అభిజన్" కోసం పిలుపునిచ్చిన వారిలో ఒకరు ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో రాజకీయ పార్టీ నాయకుడిని కలిసినట్లు తమకు సమాచారం అందిందని అధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున గందరగోళం, అరాచకాలు సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు తమకు సమాచారం అందించన్నారు. యూజీసీ నెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. యూజీసీ నెట్ కోసం వేలాదిమంది స్టూడెంట్స్ పరీక్షలకు హాజరవుతారని.. ఇలాంటి రోజున అంతరాయం కలిగించేలా ఈ ర్యాలీ చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. మరోవైపు, ర్యాలీకి పిలుపునివ్వడంతో బీజేపీపై టీఎంసీ మండిపడింది. ఒత్తిళ్లతో దీదీ.. తన చివరి రక్షణమార్గమైన పోలీసులవైపు మళ్లారని బీజేపీ ఆరోపించింది. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన తర్వాత.. ఆగస్టు 14న అర్ధరాత్రి చేపట్టన నిరసన హింసాత్మకంగా మారింది. దీంతో, పోలీసులు ముందస్తుగా ఈ ర్యాలీ కోసం భారీగా భద్రత ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story

Most Viewed