భారీ వర్షాలకు మూడు రోజుల్లో 50 మందికి పైగా మృతి

by srinivas |
భారీ వర్షాలకు మూడు రోజుల్లో 50 మందికి పైగా మృతి
X

షిమ్లా: దేశంలో పలు రాష్ట్రాల్లో కురిసిన వర్షాలు భారీ ఎత్తున ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. హిమచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా, జార్ఖండ్‌లలో గత మూడు రోజులుగా కురిసిన వేర్వేరు ఘటనల్లో 50 మందికి పైగా మరణించినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు అనేక గ్రామాలు నీట మునగ్గా, ఇళ్లన్ని బురదతో నిండిపోయాయి. మరోవైపు రాబోయే రెండు మూడు రోజుల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. వరద దాటికి ఆదివారం హిమచల్ ప్రదేశ్‌లో ఐదుగురు గల్లంతయ్యారని తెలిపారు.

ఒక్క ఈ రాష్ట్రంలో మూడు రోజుల్లో 36 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. ఉత్తరాఖండ్‌లో నలుగురు మరణించగా, 10 మందికి పైగా అచూకీ గల్లంతైంది. రెస్క్యూ సిబ్బంది వీరి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టింది. మరోవైపు ఒడిశాలో ఆరుగురు మరణించగా, 8 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ప్రభావిత ప్రాంతాలనుంచి 1,20,000 మందిని అధికారులు ఇతర ప్రాంతాలకు తరలించారు. ఇక జార్ఖండ్ లో ఐదుగురు నీటిలో కొట్టుకుపోగా, నాలుగు మృతదేహాలను వెలికితీశారు. భారీ వర్షాలకు హిమచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story