కేఫ్‌లో ‘మౌత్ ఫ్రెషనర్’ హారర్ : ఐదుగురికి రక్తపు వాంతులు.. ఏమైంది ?

by Hajipasha |   ( Updated:2024-03-04 17:49:26.0  )
కేఫ్‌లో ‘మౌత్ ఫ్రెషనర్’ హారర్ : ఐదుగురికి రక్తపు వాంతులు.. ఏమైంది ?
X

దిశ, నేషనల్ బ్యూరో : ఆ ఐదుగురు కలిసి ఎంచక్కా ఒక కేఫ్‌లో భోజనం చేశారు. అక్కడి దాకా టైమ్ కూల్ కూల్‌గా గడిచిపోయింది. ఆ తర్వాతే అసలు మంట మొదలైంది. భోజనాలు పూర్తయ్యాక కేఫ్ నిర్వాహకులు ఇచ్చిన మౌత్ ఫ్రెషనర్లను తీసుకొని వాళ్లందరూ నోట్లో వేసుకున్నారు. ఇక నోట్లో మంట మొదలైంది. దాన్ని భరించలేక ఆ ఐదుగురు అరిచి గగ్గోలు పెట్టారు. నోట్లో మంటకు తోడుగా రక్తం కూడా కారడం షురూ అయింది. కొందరు రక్తపు వాంతులు కూడా చేసుకున్నారు. ఈక్రమంలోనే వాళ్లు నోటి మంటను తగ్గించేందుకు, రక్త ప్రవాహాన్ని కంట్రోల్‌లోకి తెచ్చేందుకు చిన్నపాటి ఐస్ ముక్కలను నోట్లో వేసుకున్నారు. ఈ ఘటన మార్చి 2న గురుగ్రామ్‌ సెక్టార్ 90లోని లాఫోరెస్టా కేఫ్‌లో చోటుచేసుకుంది.అంకిత్ కుమార్ అనే వ్యక్తి తన భార్య, ఆమె స్నేహితులతో కలిసి ఈ కేఫ్‌లో లంచ్ చేశాడు. మౌత్ ఫ్రెషనర్లను తిన్నాక నోటిలో నుంచి రక్తం కారుతున్న వ్యవహారాన్ని అంకిత్ స్వయంగా వీడియో రూపంలో చిత్రీకరించారు.

అంకిత్ కుమార్ ఏం చెప్పారంటే..

‘‘కేఫ్ నిర్వాహకులు మౌత్ ఫ్రెష్‌నర్‌లో ఏం కలిపారో మాకు అర్థం కాలేదు. దానివల్లే మేం రక్త వాంతులు చేసుకున్నాం. నాలుకపై కోతలు పడ్డాయి. నోరు మండిపోయింది. మౌత్ ఫ్రెష్‌నర్‌లో యాసిడ్ కూడా ఉండి ఉంటుంది, అదే మమ్మల్ని ఇబ్బంది పెట్టింది’’ అని అంకిత్ కుమార్ చెప్పుకొచ్చారు. కేఫ్‌లోని వ్యక్తుల ద్వారా పోలీసులకు కబురు పెట్టిన అంకిత్.. వారు సంఘటనా స్థలానికి చేరుకోగానే కంప్లయింట్ అందజేశాడు. ఐదుగురు మౌత్ ఫ్రెషనర్ బాధితులను పోలీసులు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు రెస్టారెంట్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మౌత్ ఫ్రెషనర్ ప్యాకెట్‌ను చెక్ చేసిన ఓ వైద్య నిపుణుడు అందులో యాసిడ్ మూలాలు ఉన్నాయని చెప్పినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed