ఉమ్మడి మెదక్‌లో మరో మూడు అసెంబ్లీ స్థానాలు

by Mahesh |
ఉమ్మడి మెదక్‌లో మరో మూడు అసెంబ్లీ స్థానాలు
X

దిశ, సంగారెడ్డి బ్యూరో: నియోజకవర్గాల పునర్విభజన వార్తలతో రాజకీయ పార్టీల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. 2026లో జనగణన సర్వే జరగనున్నది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజన జరగనున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే మహిళా రిజర్వేషన్లు కూడా అమలు కానున్నాయని చెబుతున్నారు. పునర్విభజన జరిగితే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మరో రెండు కొత్త అసెంబ్లీ నియోజకవర్గాల స్థానాలు పెరిగే అవకాశం ఉన్నది. ఈ లెక్కన ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలున్నాయి. వీటి పరిధిలో నాలుగు అసెంబ్లీ స్థానాల పెంపు తప్పదని లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొత్త నియోజకవర్గాలపై లీడర్లు ఆశలు పెంచుకుంటున్నారు. రాజకీయ విశ్లేషకుల లెక్కల ప్రకారం సంగారెడ్డి జిల్లాలో పటాన్ చెరులో మరో అసెంబ్లీ నియోజకవర్గం అలాగే సంగారెడ్డిలో సదాశివపేట కేంద్రంగా కొత్త నియోజకవర్గం ఏర్పడే అవకాశమున్నది. ఇక మెదక్ జిల్లాలో అందోలు నియోజకవర్గంలో అల్లాదుర్గం పేరుతో అలాగే రామాయంపేట లేదా తూప్రాన్ కేంద్రంగా మరో నియోజకవర్గానికి చాన్స్ ఉన్నది. మహిళలకు 50 శాతం అవకాశాలు దక్కనుండడంతో ఇప్పుడున్న నియోజవకర్గాల స్వరూపం పూర్తిగా మారడం ఖాయంగా కనిపిస్తున్నది.

మెదక్ పార్లమెంట్ పరిధిలో రెండు..

మెదక్ పార్లమెంట్ పెద్ద నియోజకవర్గంగా వెలుగొందుతున్న విషయం తెలిసిందే. ఈ పార్లమెంట్ పరిధిలో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్, మెదక్, సంగారెడ్డి, పటాన్చెరు ఇలా మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉన్న జిల్లా కావడంతో ఏటికేడు వేగంగా ఇక్కడి ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. జనాబా పెరుగుదల అదే స్థాయిలో ఉంటుంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అతిపెద్ద పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గం ఏర్పడనున్నది. ఇక్కడ 4 లక్షల పైచిలుకు ఓటర్లున్నారు. అమీన్ పూర్, తెల్లాపూర్, ఐడీఏ బొల్లారం, పటాన్ చెరు ప్రాంతాలతో కలిసి ఓ నియోజకవర్గం, గ్రామీణ ప్రాంతాలతో మరో నియోజకవర్గం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా సదాశివపేట పేరుతో కొత్త నియోజకవర్గం ఏర్పడనున్నదని విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు. సంగారెడ్డి, సదాశివపేటలు కూడా జనాభా ఏటికేడు పెరుగుతూ వస్తోంది. ఇదిలా ఉండగా ఇదే పార్లమెంట్ పరిధిలోని తూప్రాన్ లేదా రామాయంపేట పేరుతో కూడా కొత్త నియోజకవర్గం ఏర్పడే అవకాశాలు లేకపోలేదనే చర్చ వినిపిస్తున్నది. మొత్తంగా ఈ మూడింటిలో రెండు మాత్రం ఏర్పాటు తప్పని సరంటున్నారు రాజకీయ నాయకులు.

జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో రెండు..

జహీరాబాద్ పార్లమెంట్ ఇటు సంగారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు అటు కామారెడ్డి జిల్లాలో విస్తరించి ఉన్నది. ఈ నియోజకవర్గం పరిధిలో సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, అందోలు, నారాయణఖేడ్, కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఎక్కవ అసెంబ్లీ నియోజకవర్గాలు కామారెడ్డి జిల్లాలో ఉండడంతో అక్కడి నుంచి ఒక అసెంబ్లీ స్థానం, మెదక్ జిల్లా నుంచి మరో కొత్త నియోజకవర్గం ఏర్పడనున్నట్లు చెబుతున్నారు. పెద్ద నియోజకవర్గమైన అందోలు నుంచి అల్లాదుర్గం పేరుతో కొత్తగా మరో నియోజకవర్గం ఏర్పడే అవకాశాలున్నాయి. ఈ లెక్కన అందోలు అసెంబ్లీ నియోజకవర్గం రూపరేఖలు పూర్తిగా మారిపోయే అవకాశాలున్నాయి. ఇక మరో నియోజకవర్గం కామారెడ్డి జిల్లా పరిధిలో ఏర్పడే అవకాశాలున్నాయి.

రాజకీయ లెక్కలు, ఇప్పటి నుంచే వ్యూహాలు

2026 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన తప్పదని, కొత్త నియోజకవర్గాలు ఏర్పడుతున్నాయని రాజకీయ పార్టీలు నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. కొత్తవి ఏర్పాటుతో తమకు అవకాశం ఉంటుందని ఇప్పటి నుంచే ఆశలు పెట్టుకుంటున్నారు. రాజకీయంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. పటాన్ చెరు, సంగారెడ్డి అసెంబ్లీ స్థానాల్లో కొత్త స్థానాలు పెరిగిన నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో పెద్ద డిమాండ్ ఉండనున్నది. ఇదెలా ఉండగా పునర్విభజనతో రిజర్వేషన్లు కూడా మారనున్నాయి. అందోలు నియోజకవర్గం రిజర్వేషన్ మారే అవకాశముంటుందని సీనియర్ రాజకీయ నాయకుడు ఒకరు చెప్పుకొచ్చారు. రిజర్వేషన్ మారడంతో పాటు రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడనున్న నేపథ్యంలో అందోలు రాజకీయం రసవత్తరంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇక గతంలో అసెంబ్లీ నియోజకవర్గంగా ఉన్న రామాయంపేట తర్వాత తొలగిన విషయం తెలిసిందే. తిరిగి మళ్లీ కొత్త నియోజకవర్గంగా ఆవిర్భవిస్తే రాజకీయాలు మారిపోనున్నాయి. తూప్రాన్ పేరుతోనా లేదా రామాయంపేట పేరుతో కొత్త నియోజకవర్గం అవుతుందా..? అనేది రానున్న రోజుల్లో చూడాల్సి ఉంది.

మహిళలకు పెరగనున్న అవకాశాలు..

మహిళలకు రిజర్వేషన్లు అమలు కానున్న నేపథ్యంలో అసెంబ్లీ స్థానాల పెంపు తర్వాత మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అందనున్నాయి. దీంతో ఎమ్మెల్యేలుగా సగం మంది మహిళలకు అవకాశాలు దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో లీడర్లు ఇప్పటి నుంచే వారి కుటుంబాల్లోని మహిళలకు రాజకీయంగా బయటకు తీసుకువస్తున్నట్లు నాయకులు చెబుతున్నారు. ఇప్పటి నుంచి జనంలోకి మహిళలు రావడంతో రాజకీయంగా మంచి అవకాశాలు దక్కనున్నాయని భావిస్తున్నాయి. మొత్తంగా నియోజకవర్గాల పునర్విభజనతో నియోజకవర్గాల స్వరూపం, రాజకీయాలు మారనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed