TG Govt: ఆ ప్రపోజల్‌ను రిజెక్ట్ చేసిన సీఎం రేవంత్.. ఐఏఎస్ అధికారులకు కీలక టాస్క్

by Gantepaka Srikanth |
TG Govt: ఆ ప్రపోజల్‌ను రిజెక్ట్ చేసిన సీఎం రేవంత్.. ఐఏఎస్ అధికారులకు కీలక టాస్క్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పాత అప్పులను తీర్చేందుకు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తున్నదని ఇప్పటికే మంత్రులు(Telangana Ministers) పలుమార్లు బహిరంగంగానే వెల్లడించారు. ఈ క్రమంలో ట్యాక్సు(Tax)లు పెంచి కొంత ఉపశమనం పొందే అవకాశం ఉన్నా.. అందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. అప్పులను తగ్గించుకునేందుకు రాష్ట్ర ఆదాయాన్ని పెంచేలా ప్రతిపాదనలు ఇవ్వాలని.. ఆదాయాన్ని సమకూర్చే శాఖల (మైనింగ్, లిక్కర్, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్, కమర్షియల్ ట్యాక్స్, ట్రాన్స్‌పోర్టు)ను సర్కారు ఆదేశించింది. అందుకు అనుగుణంగా ఆయా శాఖలు సర్కారుకు ప్రతిపాదనలు పంపాయి. తమ శాఖల్లో పన్నుల పెంపు లేక ఏండ్లు గడించిందని వివరించాయి. ఎంత మేరకు అదనంగా పన్నులు పెంచవచ్చో అందులో పేర్కొన్నాయి. దానివల్ల ప్రతినెలా ప్రభుత్వానికి ఎంతమేర ఆదాయం సమకూరుతుందో వివరాలను అందించారు.

పన్ను పెంపు ప్రతిపాదనలు తిరస్కరణ

ఆయా శాఖలు పంపించిన రిపోర్టుల్లో పొందుపరిచిన ప్రపోజల్స్‌ను సీఎం రేవంత్(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) పరిశీలించి తిరస్కరించినట్టు తెలిసింది. ప్రజలపై అదనపు భారం వేయకుండానే, అదనపు ఆదాయాన్ని సమకూర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఆదేశించినట్టు సమాచారం. ‘పన్నులు పెంచడానికి మేము వ్యతిరేకం. పన్నులు పెంచితే బీఆర్ఎస్ పాలనకు మాకు తేడా ఏం ఉంటుంది. ఐఏఎస్ అధికారులుగా కొత్తగా ఆలోచించండి’ అని సీఎం, డిప్యూటీ సీఎం సూచించినట్టు సమాచారం.

మూడు శాఖల్లో పెద్ద ఎత్తున లీకేజీలు!

మైనింగ్, లిక్కర్, కమర్షియల్ ట్యాక్స్ శాఖల్లో పెద్ద ఎత్తున లీకేజీలు ఉన్నాయని.. వాటిని అరికట్టాలని సీఎం, డిప్యూటీ సీఎం స్పష్టం చేసినట్టు తెలిసింది. లీకేజీల వల్ల ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున గండిపడుతున్నట్టు విమర్శలు ఉన్నాయి. ఈ లీకేజీలను అరికడితే ప్రతినెలా సగటున రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని సెక్రెటేరియట్ వర్గాల్లో టాక్. మైనింగ్, లిక్కర్, కమర్షియల్ ట్యాక్స్ శాఖల్లో ఆదాయం పక్కదారి పట్టడానికి ఆ శాఖల్లో పనిచేసే ఆఫీసర్ల ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన సమావేశంలో ‘కింది స్థాయి ఆఫీసర్ల తీరు మారాలి. అక్రమాలకు సహకరించే వారిపై చర్యలు తప్పవు’ అని హెచ్చరించినట్టు తెలిసింది.

అధికారుల ప్రమేయంతోనే..?

ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న బంగారం, ఎలక్ట్రికల్ గూడ్స్ వ్యాపారంలో పెద్ద ఎత్తున జీఎస్టీ ఎగవేస్తున్నట్లు ప్రభుత్వానికి రిపోర్టులు అందినట్టు తెలిసింది. కమర్షియల్ ట్యాక్స్‌కు చెందిన సీనియర్ అధికారుల చొరవతోనే కొందరు జీఎస్టీ ఎగవేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం కొనసాగుతున్నది. హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాలు చేస్తున్న సంస్థలు ఎంత మేరకు జీఎస్టీ చెల్లిస్తున్నాయి? ఎంత మేరకు ఎగ్గొడుతున్నాయి? అనే విషయం స్థానిక కమర్షియల్ ట్యాక్స్‌ ఆఫీసర్లకు పక్కాగా తెలుసని, వారిచ్చే సూచనల మేరకే వ్యాపారులు నడుచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మైనింగ్ శాఖలోనూ ఇసుక అక్రమ రవాణా ఇబ్బడిముబ్బడిగా జరుగుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. ప్రతినెలా జారీ చేస్తున్న టోకెన్లకు, తరలుతున్న ఇసుక‌కు మధ్య భారీ స్థాయిలో తేడాలు ఉన్నట్టు నిఘా వర్గాల ద్వారా సీఎంఓకు రిపోర్టు అందినట్లు టాక్. ఇసుక అక్రమ రవాణా దందాలో స్థానిక మైనింగ్, రెవెన్యూ, పోలీసు, ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్ల ప్రమేయం ఉందని విమర్శలు పెద్దఎత్తున వస్తున్నాయి. అందుకే.. ప్రతి లారీకీ జియో ట్యాగింగ్ తప్పనిసరి చేయాలనే ప్రపోజల్స్ ప్రభుత్వం వద్ద ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. మరోవైపు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల నుంచి అన్‌పెయిడ్ లిక్కర్ సరిహద్దు జిల్లాల్లోకి చేరుతున్నదనే ఆరోపణలు ఉన్నాయి. ఎక్సయిజ్ శాఖకు చెందిన ఆఫీసర్లు, స్థానిక పోలీసుల సహకారంతోనే రాష్ట్రంలోకి అన్‌పెయిడ్ డ్యూటీ లిక్కర్ ఎంటర్ అవుతున్నట్టు నిఘా వర్గాలు సీఎంఓకు రిపోర్టు ఇచ్చినట్టు తెలుస్తున్నది. వీటన్నింటినీ అరికడితే ప్రభుత్వానికి అదనపు రెవెన్యూ సమకూరడం పెద్ద సమస్య కాదని సీనియర్ ఆఫీసర్లు అభిప్రాయపడుతున్నారు.

ప్రతినెలా కిస్తీలకే రూ.5 వేల కోట్లు!

గత ప్రభుత్వం పదేండ్ల పాలనలో సుమారు రూ.7 లక్షల కోట్లు అప్పు చేసింది. వాటిని తీర్చడం ప్రస్తుత ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. పాత వాటిని తీర్చేందుకు కొత్తగా అప్పులు చేస్తున్నది. కిస్తీలకే ప్రతినెలా సుమారు రూ.5 వేల కోట్లకు పైనే చెల్లిస్తున్నట్టు టాక్. ఈ ఆర్థిక సంవత్సరంలో (2024–25) కిస్తీల చెల్లింపు కోసం సుమారు రూ.62 వేల కోట్లు అవసరం అవుతాయని ఫైనాన్స్ శాఖ ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తున్నది. దీనితో ఇతర ఖర్చులను పక్కన పెట్టి, వాయిదాలను చెల్లించేందుకు సర్కారు మొగ్గుచూపుతున్నది.

Advertisement

Next Story

Most Viewed