బీజేపీ 400 సీట్లు గెలవడం 'ఒక జోక్'.. 200 గెలిచేందుకే పోరాడుతోంది: శశి థరూర్

by Dishanational1 |
బీజేపీ 400 సీట్లు గెలవడం ఒక జోక్.. 200 గెలిచేందుకే పోరాడుతోంది: శశి థరూర్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలుస్తామనడం ఒక జోకు అని కాంగ్రెస్ నేత శశిథరూర్ అన్నారు. 300 స్థానాలను సాధించడం కూడా అసాధ్యమేనని, బీజేపీ 200 సీట్లు గెలిచేందుకే పోరాడుతోందని ఎద్దేవా చేశారు. బీజేపీ ఓటమి ముందుగానే అంగీకరించిందన్నారు. గురువారం జాతీయ మీడియాతో మాట్లాడిన శశిథరూర్.. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని, 2019లో దక్షిణాదిన గెలిచిన దానికంటే తక్కువ సీట్లు వస్తాయి. వాస్తవానికి గత కొంతకాలంగా ఎన్నికల ప్రచార తీరును గమనిస్తే 2014,2019 ఎన్నికలకు, ఇప్పటికి ప్రధాన తేడా బీజేపీ ఓటర్లలో ఆ పార్టీ పట్ల విశ్వాసం సన్నగిల్లింది. ఈ ఎన్నికల్లో బీజేపీ-ఎన్డీఏ ప్రభుత్వం మెజారిటీని కోల్పోవడం ఖాయమని శశిథరూర్ అభిప్రాయపడ్డారు. బీజేపీ అనుకున్న విధంగా ఈసారి పరిస్థితులు లేవని, చాలా కష్టపడుతోంది. ఉద్యోగం ఇస్తానని చెప్పిన బీజేపీకి 2014లో ఓటు వేసిన ఓ యువకుడు పదేళ్ల తర్వాత కూడా ఉద్యోగంలో లేకపోతే ఎలా బీజేపీకి మళ్లీ ఓటు వేస్తాడని శశిథరూర్ ప్రశ్నించారు. కాగా, కేరళలోని తిరవనంతపురం నుంచి ఎంపీగా పోటీ చేసిన శశిథరూర్ ఏప్రిల్ 26న జరిగిన పోలింగ్ తర్వాత మిగిలిన చోట్ల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈసారి గెలిస్తే శశిథరూర్ వరుసగా నాలుగోసారి తన స్థానాన్ని దక్కించుకున్నట్టు అవుతుంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 190 స్థానాలకు పోలింగ్ జరగ్గా, వాటిలో ఎక్కువ సీట్లలో తమదే విజయమని ఆయన పేర్కొన్నారు.

Next Story

Most Viewed