2024 ఎన్నికల కోసం బీజేపీ వ్యూహరచన.. 3 జోన్లుగా 543 లోక్ సభ స్థానాలు

by Vinod kumar |
2024 ఎన్నికల కోసం బీజేపీ వ్యూహరచన.. 3 జోన్లుగా 543 లోక్ సభ స్థానాలు
X

న్యూఢిల్లీ : వచ్చే లోక్ సభ ఎన్నికల్లో సంస్థాగత సౌలభ్యం కోసం దేశంలోని 543 స్థానాలను 3 జోన్లుగా(నార్త్‌, సౌత్‌, ఈస్ట్‌) బీజేపీ విభజించుకుంది. ఈ జోన్లవారీగా 2024 ఎన్నికల ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని కమల దళం యోచిస్తోంది. దీనికి సంబంధించిన మీటింగ్స్ జూలై 6, 7, 8 తేదీల్లో జరగనున్నాయి. ఈస్ట్ జోన్‌లో బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాలు ఉన్నాయి.

వీటి సమావేశం జులై 6న అస్సాం రాజధాని గౌహతిలో జరుగనుంది. జమ్మూ కశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్, గుజరాత్, డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానాలను నార్త్ జోన్‌లో ఉంచారు. ఈ రాష్ట్రాల మీటింగ్ జూలై 7న ఢిల్లీ వేదికగా జరుగనుంది.

సౌత్ జోన్‌లో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ముంబై, గోవా, అండమాన్ నికోబార్, లక్షద్వీప్‌లు ఉన్నాయి. ఈ జోన్‌కు సంబంధించిన సమావేశం జూలై 8న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ సమావేశాలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఆ జోన్ పరిధిలోని పార్టీ ముఖ్య నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల మంత్రులు, కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు.

ఆయా రాష్ట్రాల బీజేపీ ఇన్‌ఛార్జ్‌లు, రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జాతీయ కార్యవర్గ సభ్యులు కూడా పాల్గొంటారు. జోన్లవారీగా జరిగే ఈ మీటింగ్స్‌లో ఆయా జోన్ల పరిధిలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన జాతీయ, స్థానిక అంశాలపై నిర్ణయం తీసుకుంటారు. జోన్లవారీగా పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతలను పలువురు నేతలకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story