Independence Day: అందరికీ న్యాయం జరిగేలా చూడటమే క్రిమినల్ చట్టాల ఉద్దేశం

by Shamantha N |   ( Updated:2024-08-15 07:35:47.0  )
Independence Day: అందరికీ న్యాయం జరిగేలా చూడటమే క్రిమినల్ చట్టాల ఉద్దేశం
X

దిశ, నేషనల్ బ్యూరో: అందరికీ న్యాయం జరిగేలా చూడాలనే ఉద్దేశంతోనే మూడు కొత్త క్రిమినల్ చట్టాలు తీసుకొచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆతర్వాత జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కొత్త క్రిమినల్ చట్టాల్లో శిక్ష కంటే న్యాయానికే ప్రాధాన్యం ఇచ్చామని అన్నారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తున్నందుకు గర్విస్తున్నట్లు తెలిపారు. మహిళలు ఆర్థిక స్వావలంబ సాధించినప్పుడే కుటుంబ నిర్ణయాల్లో పాల్గొంటారని.. దానివల్లే గణనీయమన సామాజిక పరివర్తన వస్తుందన్నారు. దేశంలో దాదాపు 10 కోట్ల మంది మహిళలు స్వయం సహాయక సంఘాలలో చేరారని.. దీంతో సామాజిక మార్పునకు దోహదపడుతున్నారని అన్నారు. పని చేసే మహిళలకు ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచామని చెప్పారు. తమ ప్రభుత్వం కేవలం మహిళలను గౌరవించడమే కాకుండా.. వారి కోసం అవసరమైన ముఖ్య నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

కోల్ కతా ఘటనను ఉద్దేశించి..

కోల్ కతా మెడికో హత్యాచారం ఘటనను ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడారు. మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల భద్రతకు భరోసా ఇవ్వాలని నొక్కిచెప్పారు. ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు త్వరితగతిన విచారణ జరిపి నిందితులను శిక్షించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. మోడీ మాట్లాడుతూ.. "ఎర్రకోట నుండి నా బాధను మరోసారి చెప్పాలనుకుంటున్నా. సమాజంలోని వ్యక్తిగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి మనం తీవ్రంగా ఆలోచించాలి. దీనికి వ్యతిరేకంగా దేశం మొత్తం ఆగ్రహంతో ఉంది. ఈ ఆందోళనలు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణించాలి. ఇటువంటి క్రూరమైన ధోరణి ఉన్న వ్యక్తికి శిక్ష పడినప్పుడు వార్తల్లో కన్పించదు. పేపర్ లో ఏదో చిన్న మూలకే పరిమితం అవుతోంది. కానీ, శిక్ష అనుభవిస్తున్న వారి గురించి సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది. దీంతో, ఇలాంటి నేరానికి పాల్పడితే ఉరిశిక్ష తప్పదని అందరికి తెలుస్తోంది. ఈ భయాన్ని కలిగించడం ముఖ్యమని భావిస్తున్నా" అని మోడీ అన్నారు. ఇకపోతే, ఎర్రకోటపై వరుసగా 11వసారి ప్రధానిగా ఆయన జెండా ఎగురవేశారు. వేడుకలకు సుమారు 6 వేల మంది అతిథులు హాజరయ్యారు. అంతకు ముందు ప్రధాని మోదీ రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.

Advertisement

Next Story

Most Viewed