కేరళ ప్రొఫెసర్‌ చెయ్యి నరికిన కేసులో ముగ్గురికి జీవిత ఖైదు..

by Vinod kumar |
కేరళ ప్రొఫెసర్‌ చెయ్యి నరికిన కేసులో ముగ్గురికి జీవిత ఖైదు..
X

కోచి: పదమూడేళ్ల క్రితం (2010 జులై 4న) కేరళ ప్రొఫెసర్‌ టి.జె. జోసెఫ్‌ చేతిని నరికిన కేసులో దోషులకు ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు గురువారం శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో దోషులుగా తేలిన నిషేధిత తీవ్రవాద సంస్థ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్ఐ) ఆరుగురు కార్యకర్తల్లో ముగ్గురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. జీవిత ఖైదు శిక్ష పడిన వారిలో సాజిల్‌, నాజర్‌, నజీబ్‌ ఉన్నారు. వీరికి ఆశ్రయం కల్పించడంతో పాటు నేరం గురించి ఉద్దేశపూర్వకంగానే పోలీసులకు సమాచారం ఇవ్వనందుకు నౌషాద్‌, మొయిదీన్‌ కున్హు, అయూబ్‌ అనే దోషులకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఇడుక్కి జిల్లా తొడుపుళలోని న్యూమ్యాన్‌ కళాశాల ప్రొఫెసర్‌ జోసెఫ్‌.. బీకాం సెమిస్టర్‌ పరీక్షల ప్రశ్నాపత్రంలో ఓ మతాన్ని కించపరిచేలా ప్రశ్నలు రూపొందించారని ఆరోపిస్తూ.. ఆ ఆరుగురు పీఎఫ్ఐ కార్యకర్తలు అప్పట్లో ఆయనపై దాడికి తెగబడ్డారు.

ప్రొఫెసర్‌ జోసెఫ్‌ చర్చి నుంచి తిరిగొస్తుండగా ఆయనను అడ్డుకున్న దుండగులు తీవ్రంగా దాడి చేశారు. ఆయనను వాహనం నుంచి బయటకు లాగి ఆయన కుడి చేతిని నరికేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన సవాద్‌ నాటి నుంచి పరారీలోనే ఉన్నాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు 11 మందిని నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ఈ కేసులో మరో ఐదుగురిని నిర్దోషులుగా కోర్టు విడిచిపెట్టింది. ఈ దాడితో తాను కొంతకాలం పాటు ఉద్యోగానికి దూరమయ్యానని, ఆ సమయంలో తన భార్య ఆత్మహత్య చేసుకుందని ప్రొఫెసర్‌ జోసెఫ్‌ కోర్టుకు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed