- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ రోజు నుంచి కాళేశ్వరం అవకతవకలపై మళ్లీ విచారణ
దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని ఎంక్వయిరీ కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను నేటి నుంచి మళ్లీ ప్రారంభించనున్నది. ఈ నెల 29 వరకు జరిగే ఈ బహిరంగ విచారణకు పలువురు ఇంజినీర్లు, అధికారులు, రిటైర్డ్ ఆఫీసర్లు హాజరు కావాలని ఆదేశించింది. ఇరిగేషన్ శాఖ వ్యవహారాలు చూసిన ఐఏఎస్ అధికారులను సైతం ఈ నెల చివరలో విచారణకు పిలిచింది. ఇప్పటికే అఫిడవిట్లు సమర్పించిన తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ సహా పలువురిని ఈ వారం రోజుల్లో జస్టిస్ పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. మరోవైపు స్టేట్ విజిలెన్స్ కమిషన్ డైరెక్టర్ జనరల్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉదయం జస్టిస్ ఘోష్‌తో గంట పాటు చర్చించారు. తుది నివేదికను వెంటనే ఇవ్వాల్సిందిగా ఆయన్ను జస్టిస్ ఆదేశించారు. కమిషన్‌కు అవసరమైన డాక్యుమెంట్ల వివరాలను వీలైనంత తొందరగా అందజేస్తానని విజిలెన్స్ డీజీ క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది.
ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లతో చర్చలు
సెప్టెంబర్ చివరి వారంలో క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయిన తర్వాత బ్రేక్ ఇచ్చిన జస్టిస్ ఘోష్... తిరిగి ఆ ప్రక్రియను ప్రారంభించనున్నందున ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులతో మంగళవారం మీట్ అయ్యారు. ఏ రోజు ఎవరిని పిలవాలనే అంశంపై చర్చించి షెడ్యూల్ ఖరారుపై కసరత్తు చేశారు. ఇప్పటివరకూ జరిగిన క్రాస్ ఎగ్జామినేషన్ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు జరిగినా రానున్న వారం రోజుల్లో మాత్రం ఉదయం, సాయంత్రం సెషన్‌లుగా నిర్వహించేందుకు కమిషన్ ప్లాన్ చేసింది. ఇప్పటికే హాజరై వివరణ ఇచ్చిన ఇంజినీర్లు, రిటైర్డ్ అధికారుల్లో ఇద్దరిని మరోసారి రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఇరిగేషన్ శాఖకు గతంలో కార్యదర్శలుగా బాధ్యతలు నిర్వర్తించిన బ్యూరోక్రాట్లు ఎస్‌కే జోషి, రజత్ కుమార్, స్మితా సభర్వాల్, వికాస్‌రాజ్, అఫిడవిట్ సమర్పించిన మాజీ చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ తదితరులను ఈ నెల చివరలో జస్టిస్ ఘోష్ క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నట్లు కమిషన్ వర్గాల సమాచారం.
కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధులను సైతం
బహిరంగ విచారణకు కొనసాగింపుగా త్వరలోనే మూడు బ్యారేజీలను నిర్మించిన కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధులను సైతం జస్టిస్ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఇప్పటిదాకా ప్లానింగ్, డ్రాయింగ్, డిజైన్, ఎగ్జిక్యూషన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్, మెయింటెనెన్స్ తదితర అంశాల చుట్టూ ఎంక్వయిరీ జరగ్గా రానున్న రోజుల్లో ఆర్థిక అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ పేరుతో తీసుకున్న రుణాలు, కాంట్రాక్టర్లకు చేసిన పేమెంట్స్, సబ్ కాంట్రాక్టర్లను నియమించుకోవడం, అంచనా వ్యయం పెంపునకు దారితీసిన పరిస్థితులు, ప్రతిపాదనలు ఎవరు పంపారు.. వాటికి ఆమోదం ఎవరు చేశారు.. రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలు, ‘కాగ్’ ఇచ్చిన నివేదిక.. అందులో పేర్కొన్న లోపాలు.. ఇలాంటి అంశాలపై కమిషన్ ఫోకస్ పెట్టనున్నది. కాగ్ రీజినల్ అధికారులు, ఆడిటర్లను కూడా ఓపెన్ హౌజ్ ఎంక్వయిరీకి హాజరు కావాలని త్వరలో సమాచారం ఇవ్వనున్నది. వారి ఆడిటింగ్ రిపోర్టులో పేర్కొన్న అబ్జర్వేషన్స్‌కు తగిన ఆధారాలు కోరే చాన్స్ ఉన్నది.
ఫైనల్ రిపోర్టులపై దృష్టి
ఢిల్లీలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇవ్వాల్సిన తుది నివేదిక, గతంలో మూడు బ్యారేజీల దగ్గర ఫీల్డ్ స్టడీ చేసిన పూణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిపుణులు ఇవ్వాల్సిన ఫైనల్ రిపోర్టుపైనా కమిషన్ దృష్టి సారించింది. త్వరలోనే ఆ రెండు రిపోర్టులూ అందుతాయని భావిస్తున్నది. ఈ నెల 31వ తేదీతో కమిషన్ గడువు పూర్తి కానున్నందున రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించే అవకాశాలు ఉన్నాయి.