మణిపూర్‌లో కేంద్రమంత్రి ఇంటికి నిప్పు.. అందుకే కంట్రోల్ చేయలేకపోయామన్న పోలీసులు

by Vinod kumar |
మణిపూర్‌లో కేంద్రమంత్రి ఇంటికి నిప్పు.. అందుకే కంట్రోల్ చేయలేకపోయామన్న పోలీసులు
X

న్యూఢిల్లీ : రెండు తెగల మధ్య ఘర్షణలతో మణిపూర్‌ అట్టుడుకుతోంది. బుధవారం కుకీ తెగకు చెందిన రాష్ట్ర మహిళా మంత్రి ఇంటికి ఆందోళనకారులు నిప్పుపెట్టిన ఘటనను మరువకముందే అలాంటిదే మరో సంఘటన చోటుచేసుకుంది. గురువారం రాత్రి మైతై తెగకు చెందిన కేంద్ర మంత్రి ఆర్కే రంజన్‌ సింగ్‌ నివాసాన్ని దాదాపు 1200 మంది ఆందోళనకారులు చుట్టుముట్టి పెట్రోలు బాంబులు విసిరారు. దీంతో ఇంఫాల్‌లోని కోంగ్బా ప్రాంతంలో ఉన్న ఆయన ఇల్లు కాలిపోయింది. అయితే దాడి జరిగిన సమయంలో ఇంట్లో మంత్రి లేరని పోలీసులు వెల్లడించారు.

కేంద్ర మంత్రి రంజన్‌ సింగ్‌ ఇంటిపై దాడి జరగడం ఇది రెండోసారి. గత నెలలో కూడా ఆందోళనకారులు ఆయన ఇంటిని చుట్టుముట్టగా.. భద్రతా సిబ్బంది గాలిలోకి కాల్పులు జరిపి చెదరగొట్టారు. అయితే అల్లరి మూకలు వందలాదిగా తరలిరావడంతో గురువారం రాత్రి దాడిని అడ్డుకోలేకపోయామని ఎస్కార్ట్‌ కమాండర్‌ దినేశ్వర్‌ సింగ్‌ చెప్పారు. దాడి జరిగిన టైంలో కేంద్ర మంత్రి ఇంటి వద్ద ఐదుగురు సెక్యూరిటీ గార్డులు, తొమ్మిది మంది భద్రతా సిబ్బంది, మరో ఎనిమిది మంది అదనపు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు.

‘‘ఒక్కసారిగా షాక్‭కు గురయ్యాను. మణిపూర్ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి. శాంతి స్థాపనకు అందరూ కలిసి రావాలి’’ అని కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి ఆర్.కే. రంజన్ సింగ్ అన్నారు. గత నెల రోజుల నుంచి మణిపూర్‭లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరుస పర్యటనలు చేస్తూ.. శాంతి భద్రతల్ని అదుపులో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలో ఆయన తోటి మంత్రే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed