రెచ్చిపోయిన తీవ్రవాదులు.. 10 మంది కార్మికుల కిడ్నాప్

by Hajipasha |
రెచ్చిపోయిన తీవ్రవాదులు.. 10 మంది కార్మికుల కిడ్నాప్
X

దిశ, నేషనల్ బ్యూరో : అసోం - అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు సమీపంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఓ బొగ్గు గనిలో పనిచేస్తున్న 10 మంది కార్మికులను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. నిషేధిత తీవ్రవాద సంస్థలైన నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఎ‌న్ఎస్‌సీఎన్), యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఇండిపెండెంట్ (ఉల్ఫా-1)లకు చెందిన మిలిటెంట్లు కార్మికులను అపహరించి ఉంటారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అసోం సరిహద్దుకు సమీపంలోని అరుణాచల్ ప్రదేశ్‌లోని చాంగ్లాంగ్ జిల్లాలో ఉన్న ఫిన్‌బోరో కోల్‌మైన్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగిందని తెలిపాయి. మొత్తం 14 మంది కార్మికులకు ఉగ్రవాదులు అపహరించారని.. అయితే వారిలో నలుగురు మార్గం మధ్యలోనే తప్పించుకొని సురక్షితంగా తిరిగొచ్చారని చెప్పారు. ఉగ్రవాదులు తుపాకీ చూపించి బెదిరించి కార్మికులను తీసుకెళ్లారని వారి సహోద్యోగులు తెలిపారు. కిడ్నాప్ చేసిన కార్మికులను అరుణాచల్ ప్రదేశ్‌లోని ఓల్డ్ లాంగ్‌టోయ్ అనే మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లారని వివరించారు. అయితే కిడ్నాప్‌కు గురైన వారి సంఖ్యపై ఇంకా క్లారిటీ లేదని అసోంలోని టిన్సుకియా ఎస్పీ గురవ్ అభిజిత్ దిలీప్ వెల్లడించారు. కిడ్నాప్‌కు గురైన వారిలో కొంతమంది అసోం వాస్తవ్యులని చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం అదనపు బలగాలను రంగంలోకి దింపామన్నారు. కార్మికుల కిడ్నాప్ విషయమై మిలిటెంట్ గ్రూపుల వైపు నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన కానీ.. డిమాండ్ కానీ ఇంకా రాలేదని ఎస్పీ దిలీప్ చెప్పారు. గతంలోనూ ఇదేవిధంగా కార్మికులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి వదిలేసిన ఘటనలు చోటుచేసుకున్నాయని ఆయన గుర్తు చేశారు.

Advertisement

Next Story

Most Viewed