ధోనీకి బాసటగా 'ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్'

by Shiva |   ( Updated:2020-04-12 01:41:52.0  )
ధోనీకి బాసటగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్
X

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌పై కొన్ని నెలలుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. గతేడాది ప్రపంచ కప్ తర్వాత నుంచి ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోనీ.. ఐపీఎల్‌లో రాణించి సత్తా చాటాలనుకున్నాడు. కానీ, కరోనా ప్రభావం కారణంగా ఐపీఎల్ నిర్వహించే ఛాన్స్ లేకపోవడంతో అతడి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఈ సమయంలో రిటైరవ్వాలంటూ ధోనీపై ఎవరూ ఒత్తిడి తేవొద్దని ఇంగ్లాండ్ మాజీ క్రికెట్ నాసిర్ హుస్సేన్ కోరాడు. అతడిలో ఇంకా చాలా ఆట మిగిలే ఉందని తాను భావిస్తున్నట్లు ఒక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

భారత జట్టులోకి ఎంపికయ్యే సామర్థ్యం ఉందా ? అని ధోనీని అడగాల్సిన అవసరం లేదని.. ఎందుకంటే ఈ ప్రశ్న ప్రతీ ఆటగాడికి వర్తిస్తుందని నాసిర్ అన్నాడు. లక్ష్య ఛేదనలో ధోనీ ఒకటి రెండు సార్లు తప్పుచేసి ఉండొచ్చు.. కానీ అతడిలో టాలెంట్‌కు మాత్రం కొదువ లేదని అభిప్రాయపడ్డాడు. ‘తరానికి ఒక్కసారే వచ్చే దిగ్గజాలు చాలా కొంతమందే ఉంటారు. ధోనీ కూడా అలాంటి దిగ్గజమే అని.. ఒకసారి అతడు ఆటను వదిలేసి వెళ్తే.. తిరిగి ఎవరూ తీసుకురాలేరని’ నాసిర్ హుస్సేన్ చెప్పాడు. ధోనీపై ఒత్తిడి తేవొద్దని.. ధోనీ మనసులో ఏముందో అతనికి మాత్రమే తెలుసని నాసిర్ వెల్లడించాడు.

Tags: Dhoni, Nasir Hussain, England, Retirement, Leggings

Advertisement

Next Story