నాదెండ్ల మనోహర్: విశాఖ ఉక్కుపై వైసీపీ ఎంపీలు ఫైట్ చేయాలి

by srinivas |
nadendla manohar
X

దిశ, ఏపీ బ్యూరో : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పార్లమెంట్‌లో గళమెత్తాలని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచించారు. ఏపీ నుంచి ఎన్నికైన ఎంపీలు, ముఖ్యంగా వైసీపీకి చెందిన ఎంపీలు రాష్ట్ర ప్రజల తరపున ఉక్కు పరిశ్రమపై పోరాటం చేయాలని కోరుతూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించాలి. ప్రైవేటీకరణ కాకుండా నిలువరించాలి. ఈ బాధ్య వైసీపీ ఎంపీలపై మరింత ఎక్కువగా ఉంది. పార్లమెంట్‌లోనూ.. బయట ప్లకార్డులు పట్టుకుని విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు పోరాటం చేయాలి’ అని సూచించారు.

‘గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎంతోమంది త్యాగాలు చేసి ఏ విధంగా పోరాడారో అదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలుపు మేరకు పార్టీ తరపున మూడు రోజుల పాటు డిజిటల్ క్యాంపైన్ ప్రారంభించాం. రాష్ట్రం నుంచి రాజ్యసభ, లోక్‌సభలకు వెళ్లిన పార్లమెంట్ సభ్యులకు ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉంటుంది. దాన్ని గుర్తిచేసేందుకే రాష్ట్ర వ్యాప్తంగా మా వీర మహిళలు, జనసైనికులు పెద్ద ఎత్తున ఈ డిజిటల్ కాంపైన్‌లో పాల్గొంటున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే భావోద్వేగ నినాదాన్ని మరోసారి పలుకుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు, మా పార్టీ నాయకులు, చేపడుతున్న ఆందోళనను పార్లమెంట్‌లో మీ గళం రూపంలో వ్యక్తపరచాలని జనసేన పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నట్లు’ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed