మఠాధిపతిగా ముస్లిం వ్యక్తి..

by Shamantha N |
మఠాధిపతిగా ముస్లిం వ్యక్తి..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టా(సీఏఏ)నికి వ్యతిరేకంగా ముస్లిలందరూ ఆందోళనలు చేస్తున్నవేళ కర్నాటకలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఓ వ్యక్తి మఠాధిపతిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఘటన గడగ్‌ జిల్లా మురుగేంద్ర పౌరనేశ్వరమఠంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. బసవేశ్వరుడి బోధనలను విశ్వసించే దివాన్‌ షరీఫ్‌ ముల్లాకు మఠానికి చెందిన గోవింద్‌ భట్‌, కజురి స్వామీజీలు.. జంధ్యాన్ని ధరింపజేసి మఠం బాధ్యతలను అప్పగించారు. అంతేకాకుండా, అక్కడి స్వామీజీల బోధనలకు ఆకర్షితులైన షరీఫ్‌ తల్లిదండ్రులు సైతం మఠానికి రెండెకరాల భూమిని విరాళంగా ఇవ్వడం విశేషం. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ.. తాను మఠం బాధ్యతలు చేపట్టడాన్ని ఎవరూ వ్యతిరేకించలేదని తెలిపారు. ‘నీ కులం, మతం ఏమిటన్నది ప్రధానం కాదు. దేవుడు చూపిన మార్గాన్ని అనుసరిస్తే మనుషులు సృష్టించిన కులమతాలనేవి అడ్డంకులు కావు’ అని మురుగరాజేంద్ర కొరానేశ్వర స్వామి చెప్పిన బోధనలు తనలో ఆలోచనలకు రేకెత్తించాయని తెలిపారు. అయితే, గడగ్‌ మఠంలో ఇలాంటివి సాధారణమేనని, గతంలోనూ కొందరు ముస్లింలు జాత్రా కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించారని స్థానిక కాంగ్రెస్‌ నేత హెచ్‌కే పాటిల్‌ తెలిపారు. కాగా, రాష్ట్రంలోని చిత్రదుర్గలో శ్రీజగద్గురు మురుగరాజేంద్ర మఠానికి చెందిన 361 శాఖల్లో గడగ్‌లోని లింగాయత్‌ మఠం ఒకటి.

Advertisement

Next Story