మఫ్టీ సరే.. హెల్మెట్ ఏది … ?

by Shyam |   ( Updated:2023-05-19 13:21:59.0  )
మఫ్టీ సరే.. హెల్మెట్ ఏది … ?
X

దిశ ప్రతినిధి, మెదక్ : సిద్దిపేటలో అమలవుతున్న తీరును పరిశీలించడానికి సిద్దిపేట ఇంచార్జీ అడిషనల్ ఎస్పీ రామేశ్వర్ ఆదివారం రాత్రి మఫ్టీలో బైకుపై పర్యటించి పట్టణంలోని అన్ని చెక్‌పోస్టులను పరిశీలించారు. మఫ్టీలో తిరుగుతున్న విషయం తెలియకుండా ఉండేందుకు ముఖానికి మాస్కుగా టవల్‌తో ముఖాన్ని కవర్ చేశారు. అయితే అన్ని పర్యటించే సమయంలో హెల్మెట్ పెట్టుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ట్రాఫిక్ రూల్స్ సామాన్య జనానికేనా… పోలీసులకు వర్తించవా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మఫ్టీలో పర్యటన …

సిద్దిపేట పట్టణంలోని అన్ని చెక్‌పోస్టుల వద్ద పోలీసులు ఎలాంటి బందోబస్తు నిర్వహిస్తున్నారన్న విషయం తెలుసుకోవానికి సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ వినూత్న ప్రయోగం చేశారు. పోలీస్ యునిఫాంలో కాకుండా సివిల్ డ్రెస్ లో ముఖానికి టవల్ కట్టుకొని ద్విచక్ర వాహనంపై సామాన్యుడిలా పర్యటించారు. అన్ని చెక్‌పోస్ట్ ల వద్ద పోలీసులు ఏసీపీని గుర్తించలేదు. సామాన్య వ్యక్తిలా భావించి ఎందుకు వచ్చావని అడగ్గా… తాను బైక్ మెకానిక్ నని, గోళీ తెచ్చుకోవడానికి మెడికల్ షాప్ కు వచ్చానని, తన ఇల్లు సిద్దిపేట ఎల్లమ్మ టెంపుల్ వద్ద ఉంటుందని, తాను వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని సమాధానమిచ్చాడు. అబద్దం చెబుతున్నాడు గ్రహించిన బందోబస్తు పోలీసులు అతన్ని బైక్‌ను ఆపివేశారు. అరే సార్ మెడికల్ షాపుకు అనుమతి ఇచ్చారు కానీ గోళి తెచ్చుకోవడానికి మాకు అనుమతి ఇవ్వరా అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ పోలీసులు అతను చెప్పిన సమాధానం పట్ల సంతృప్తి చెందలేదు. మఫ్టీ లో వచ్చింది తమ ఉన్నతాధికారి అని తెలియని కొందరు పోలీసులు ఏసీపీ తో దురుసుగా ప్రవర్తించారు కూడా. ఓ చెక్‌పోస్టు వద్ద మంత్రి పీఏకు తనకు తెలుసని, తనతో మాట్లాడాలని బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులను అడిగారు. వారు దానికి ఒప్పుకోలేదు. ఇలా అన్ని చెక్‌పోస్టుల వద్ద పర్యటించారు. అనంతరం తాను ఏసీపీ నని ముఖానికి ఉన్న మాస్కు తీయడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ సందర్భంగా పోలీసులకు పలు సూచనలు, సలహాలు చేశారు.

హెల్మెట్ లేకపోవడంపై తీవ్ర విమర్శలు…

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పడు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని గతంలోనే సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్‌ డేవిస్ ఆదేశించారు. కాగా ఆదివారం రాత్రి పోలీసుల పనితీరును పరిశీలించడానికి సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ బైకుపై పర్యటించిన సమయంలో హెల్మెట్ ధరించలేదు. దీనిపై సిద్దిపేట జిల్లా ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్య ప్రజలు హెల్మెట్ పెట్టుకోకుంటే చలాన్లు వేసే పోలీసులు.. ఏసీపీకి చలాన్ ఎందుకు వేయలేదంటూ ప్రశ్నిస్తున్నారు. అంటే పోలీసులకు ఒక రూల్… సామాన్యులకు మరో రూలా అంటూ సోషల్ వీడియాలో ఏసీపీ పర్యటించిన వీడియోను షేర్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. దీనిపై సిద్దిపేట సీపీ ఎలా స్పందిస్తాడో చూడాలి మరీ

Advertisement

Next Story

Most Viewed