ఆ భూములకు రెక్కలొచ్చాయ్.. ఎకరం లక్ష నుంచి..!

by Aamani |   ( Updated:2021-07-08 12:07:36.0  )
ఆ భూములకు రెక్కలొచ్చాయ్.. ఎకరం లక్ష నుంచి..!
X

దిశ, ముధోల్ : ప్రస్తుతం భూమి కలిగి ఉన్నవారు భవిష్యత్తులో కోటీశ్వరులు అయ్యే అవకాశం లేకపోలేదు. ఎంటీ నమ్మశక్యం కావడం లేదా..? అవును నిజమే.. ఈరోజుల్లో డబ్బులు ఉంటే కరిగిపోవచ్చు. కానీ, భూమి ఉంటే రేపటిరోజున కోట్లు కుమ్మరిస్తుంది. బంగారం ధరలు అయినా ఓ రోజు పడిపోయి మళ్లీ పెరగచ్చు. కానీ భూముల రేట్లు మాత్రం ఎప్పటికీ పెరగడమే తప్ప తగ్గే అవకాశాలు కన్పించడం లేదు. దానికి కారణం రియల్ రంగంలో డబ్బులు పెట్టుబడి పెట్టేవారు రోజురోజుకూ ఎక్కువ అవ్వడమే.

ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముధోల్ తాలుకాలోని భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. మొన్నటికి మొన్న వేలల్లో ఎన్న ఎకరం ధర.. నిన్నవరకు లక్షకు చేరుకుంది. రేపు కోటికి చేరుకున్న ఆశ్చర్య పోనక్కరలేదు. సాధారణంగా ఒక ఎకరం భూమిలో పండించే పంట రాబడి దాదాపు లక్ష దాటదు. అలాంటిది ఒక ఎకరం భూమి మాత్రం లక్షలు, కోట్లలో అమ్ముడు పోతున్న వైనం తెలంగాణలో ప్రస్తుతం ఎక్కువ కనిపిస్తోంది. ఒకప్పుడు భూములను పంటలు పండించే ఆహార దేవతగా చూసేవారు. కానీ ఇప్పుడు లక్షలు తెచ్చిపెట్టే లక్ష్మి దేవిగా చూస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. బ్లాక్ మనీ బాబులు డబ్బును వైట్‌గా మార్చు కోవడం కోసమే భూములకు అధిక ధరలు సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది.

కార్లలో రాకపోకలు..

ఒకప్పుడు పల్లెలకు కార్లు వచ్చాయంటే శుభకార్యమో లేక రాజకీయ నాయకుల ప్రసంగమో వుండేది. కానీ
ఈ మధ్య పల్లెలకు పట్నం నుండి విపరీతంగా కార్లు సంచరిస్తున్నాయి. ఐదు, ఆరు సంవత్సరాల క్రితం పల్లెల్లో భూములకు కేవలం పంట పరంగానే విలువ వుండేది. కానీ ప్రస్తుతం డబ్బు పరంగా విలువ ఏర్పడింది. కార్లలో వచ్చే బడా బాబులు లక్షలు చెల్లిస్తూ భూములు కొంటున్నారు. మరికొన్ని చోట్ల ఏకంగా కోట్లు సైతం ఖర్చు పెడుతున్నారు.

కౌలు రైతు కౌలు రైతుగానే..

ఒకప్పుడు వ్యవసాయం చేసే కొందరు కౌలు రైతులు కౌలు చేస్తూ… పొలంలో పంటను పండించి అమ్మగా వచ్చిన డబ్బులను సంవత్సరానికి కొద్దికొద్దిగా కూడబెట్టుకొని ఇంకా కొంచం భూమి కొనడమో, తమ కుటుంబ అవసరాలు తీర్చు కోవడమో చేసేవాళ్లు. బడాబాబులు, డబ్బున్న వారు ఇలా లక్షల్లో పెట్టి భూములను కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులోనూ కౌలు రైతుకు భూమిని కొనుగోలు చేసే అవకాశం లేకపోవచ్చు.

భూమి ఉన్నవారికే ప్రయారిటీ..

కొన్ని సంవత్సరాల క్రితం ఉద్యోగం చేస్తున్న అబ్బాయిలకు మాత్రమే అమ్మాయిలను ఇచ్చి పెళ్ళి చేసేందుకు ఆసక్తి చూపేవారు. ఇపుడు ఉద్యోగం ఉన్న వాళ్ళ కంటే భూమి అధికంగా ఉన్న అబ్బాయిలకు పిల్లను ఇవ్వడానికి తల్లిదండ్రులు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఎన్నో ఏళ్లు ఉద్యోగం చేస్తే గానీ ఒక ఎకరం కూడా కొనలేమన్నా ఫీలింగ్ ప్రస్తుతం అందరిలో ఏర్పడుతోంది. దీనివల్లే జాబ్ చేసే వారికంటే భూమి ఉన్నవాళ్లకే తమ పిల్లను ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మార్కెట్లో అబ్బాయి భూమికి ఉన్న వాల్యూను బట్టి కూడా కట్నకానుకలు డిసైడ్ చేస్తున్నారు.

విలువ లేని భూములకు సైతం విలువ..

ఒకప్పుడు గ్రామాల్లోని గుట్టలు, సుదూర ప్రాంత భూములకు విలువ వుండేది కాదు. అమ్ముదామన్నా కొనే వారు కరువు. కానీ ప్రస్తుతం, ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరుతోనో లేదా బ్లాక్ మనీని వైట్‌గా చేయడం కోసం ఎలాంటి భూమి కైనా మార్కెట్లో ధర భారీగా పలుకుతోంది. గుట్ట ప్రాంతాలను అయితే పిండి చేసి మరి వెంచర్లు ఏర్పాట్లు చేసి ప్లాట్లుగా అమ్మేస్తున్నారు. దీంతో భూముల ధరలు ఆకాశానంటుతున్నాయి.

ఎక్కువ శాతం కౌలు రైతుగా మారుతున్న వైనం

వ్యవసాయం చేసుకునే రైతులకు తమ భూమిని అమ్మాలని లేకున్నా బడా బాబులు మాత్రం అధిక డబ్బు ఆశ చూపించి విపరీతంగా కొంటున్నారు. దీంతో తమ భూమిని అమ్ముకుని అదే భూమిలో కొందరు కౌలు రైతులుగా మారుతున్నారు. మరల వీళ్లు తమ భూమిని కొనే ఆస్కారం లేకుండా పోతోంది. కారణం మార్కెట్లో ఆ భూమికి డిమాండ్ అధికంగా ఏర్పడేలా బడా బాబులు ప్లాన్ చేయడమే. ఆ భూముల చుట్టూ ఏదైనా ప్రభుత్వ వెంచర్, స్కీం, ప్రాజెక్టుల రావడం.. ఆ విషయం ఈ డబ్బున్న నేతలకు, వ్యాపారులకు ముందుగా తెలియడంతో ముందస్తు వ్యుహం ప్రకారమే అధిక డబ్బు చెల్లించి రైతుల నుంచి గంపగుత్తగా భూములు కొంటున్నారు. ఈ విషయం తెలియక అమాయక రైతులు బడా బాబుల చెల్లించే డబ్బులతో తమ పిల్లల పెళ్లిళ్లు, ఇండ్లు కట్టుకొని జీవిస్తున్నారు. తీరా డబ్బులు అయిపోయాక తిరిగి అవే భూముల్లో కౌలు రైతుగా మారుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed