సుప్రీంకోర్టులో ఎంపీ రఘురామ మరో పిటిషన్

by srinivas |
సుప్రీంకోర్టులో ఎంపీ రఘురామ మరో పిటిషన్
X

దిశ, ఏపీ బ్యూరో: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు జగన్ కేసుల విషయాన్ని వదలడం లేదు. ఇప్పటి వరకు జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టుల్లో పిటిషన్లు వేశారు. అయితే ఆ కేసుల్లో నిరాశ ఎదురవ్వడంతో తాజాగా తన రూటు మార్చారు. బెయిల్ రద్దు చేయాలన్న అంశాన్ని పక్కనబెట్టి ఇప్పుడు కొత్తరాగం అందుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఉన్న కేసుల విచారణ వేగవంతం చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీలో శనివారం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. సుప్రీంకోర్టులో శుక్రవారం ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ కేసుల విచారణ త్వరగా జరిగితే జగన్‌కే మంచిదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎవరూ వేలెత్తి చూపే అవకాశం ఉండదు..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేసులపై విచారణ వేగవతం అయితే వైసీపీకి ఎంతో మంచిదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. జగన్ కడిగిన ముత్యంలా బయటపడతాడు కదా అంటూ సెటైర్లు వేశారు. చార్జిషీట్లు నమోదైన కేసుల్లో సంవత్సరంలోగా విచారణ ముగించాలని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జగన్ కేసుల విచారణ త్వరగా పూర్తయితే ఇక ఆయనను ఎవరూ వేలెత్తి చూపే అవకాశం ఉండదన్నారు. కిందికోర్టుల్లో కొట్టేసినట్టు తన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయదని భావిస్తున్నట్టు రఘురామ అభిప్రాయపడ్డారు. అయితే తాను గతంలో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌లతో తాజా పిటిషన్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. అప్పట్లో కూడా తాను జగన్ బెయిల్ రద్దైనా విచారణ వేగంగా జరిగితే ఆయన నీలాపనిందలు లేకుండా బయటపడతాడన్న ఉద్దేశంతోనే బెయిల్ రద్దు పిటిషన్ వేసినట్లు ఎంపీ రఘురామ వివరణ ఇచ్చారు.

భీమవరంలో నా ఇల్లు, కార్యాలయంపై దాడి జరగొచ్చు..

రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పౌరయుద్ధం తప్పదేమోనన్న అనుమానం వస్తోందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. త్వరలోనే భీమవరంలోని తన ఇల్లు, కార్యాలయాలపై కూడా దాడి జరిగే అవకాశం లేకపోలేదని తెలుస్తోందన్నారు. వచ్చే వారమే దాడి చేయాలని కార్యకర్తలకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లినట్టు తనకు సమాచారం అందిందన్నారు. ఈ విషయాన్ని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లానని.. అలాగే డీజీపీ గౌతం సవాంగ్‌కు లేఖ రాసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మంగళగిరిలో కాబట్టి దాడులతో సరిపెట్టారని, అదేసీమలోనైతే పరిస్థితి ఖూనీల వరకు వెళ్లేదని వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్న వ్యాఖ్యలను ప్రత్యేకంగా రఘురామ కృష్ణంరాజు ప్రస్తావించారు.

Advertisement

Next Story