సీడ్ బౌల్ అన్నారు.. మళ్లీ జైల్లో వేస్తామంటున్నారేంటీ..?

by Sridhar Babu |
సీడ్ బౌల్ అన్నారు.. మళ్లీ జైల్లో వేస్తామంటున్నారేంటీ..?
X

దిశ. హుజురాబాద్ : సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ చేస్తా అని చెప్పి.. ఇప్పుడు సీడ్ అమ్మితే జైల్లో వేస్తా అంటున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరి వేస్తే జైలులో వేస్తా అంటున్న వాళ్లు గంజాయి సాగు చేస్తే జైలుకు పంపుతామని ఎందుకు అనడం లేదని ప్రశ్నించారు. మక్క వద్దు చెరుకు వద్దు అన్నారు కదా.. 2014 మేనిఫోస్టోలో చెరుకు పరిశ్రమ ఏర్పడుతుందన్న ప్రకటనలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తాను పసుపు మద్దతు ధర ఎక్కువ ఇప్పించడంలో సఫలం అయ్యాయన్నారు. ఫసల్ భీమా తెలంగాణలో అమలు చేయకపోవడంతో ఇక్కడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అర్వింద్ ఆందోళన వ్యక్తం చేశారు. కేజీ టు పీజీ విద్య, జిల్లాకో సూపర్ స్పెషాలిటీ అమలు ఏమైందని ప్రశ్నించారు.

2014 నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తూనే ఉన్నారన్నారు. అమరుల సంక్షేమానికి రూపాయి ఖర్చుపెట్టలేదని, అంతర్జాతీయ స్థాయిలో అమరుల స్మృతి చిహ్నం ఎక్కడ కట్టారని అడిగారు. నిధులు లేక స్పోర్ట్స్ అకాడమీలు బంద్ అయ్యాయని, నిరుద్యోగులకు భృతి ఇచ్చే ఊసే లేకుండా పోయిందని అన్నారు. ఆదివాసులకు పొడు భూములు ఇస్తామని చెప్పి మర్చిపోయారని నిజామాబాద్ ఎంపీ ఆరోపించారు. టీఆర్ఎస్‌ను గద్దె దింపి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కేంద్రం నుంచి అధిక మొత్తంలో నిధులు తెచ్చుకుంటామని స్పష్టం చేశారు. హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ విజయం లాంఛనమేనని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ప్రతీ పంటకు మద్దతు ధర పెంచుతున్నామని వెల్లడించారు.

Next Story

Most Viewed