హై..హై నాయక.. హొయ్.. హొయ్ నాయక..: విశ్వనట చక్రవర్తి ఎస్.వీ రంగారావు యాదిలో...

by Shiva |   ( Updated:2023-07-04 06:18:33.0  )
హై..హై నాయక.. హొయ్.. హొయ్ నాయక..:  విశ్వనట చక్రవర్తి ఎస్.వీ రంగారావు యాదిలో...
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు చలనచిత్ర రంగంలో ప్రతినాయక పాత్రలు పోషించి, ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి నటులకు సరితూగే రూపం ఆ మహానుభావుడిది. రావణాసురుడు, హిరణ్యకశిపుడు, కీచకుడు, మాంత్రికుడు లాంటి పాత్రలకు ఆజానుబాహుడు, తెలుగు, తమిళ భాషలలో అనర్గళంగా డైలాగులను చెబుతూ తెలుగు ప్రజల చేత శభాష్ అనిపించుకున్న ఒకే ఒక్క నటుడు విశ్వనట చక్రవర్తి ఎస్.వి రంగారావు. కృష్ణా జిల్లాలోని నూజివీడులో 1918 జూలై 3న లక్ష్మి నరసాయమ్మ, కోటీశ్వర నాయుడుకు ఎస్.వి రంగారావు జన్మించారు. వారి స్వస్థలం కాకినాడ. ఆయన తండ్రి ఎక్సైజ్ ఇంచార్జిగా నూజివీడులో విధులు నిర్వర్తించేవారు. తల్లి వెంకటేశ్వర స్వామి భక్తురాలు కావడ వల్ల తన కొడకుకు వెంకట రంగారావు అనే పేరు పెట్టుకున్నారు.

రంగారావు పాఠశాల విద్య ఎస్.ఎస్.ఎల్.సి వరకు మద్రాసులోని నాయనమ్మ వద్ద కొనసాగింది. అనంతరం ఆమె ఏలూరు మకాం మార్చడంతో విశాఖలో ఇంటర్, కాకినాడలో బీఎస్సీ పూర్తి చేశారు. కాకినాడలోని యంగ్ మాన్స్ హ్యాపీ క్లబ్ వారు ప్రదర్శించే నాటకాల్లో రంగారావు నిత్యం పాల్గొంటూ ఉండేవారు. అప్పుడే బీ.ఏ.సుబ్బారావు, ఆదినారాయణరావు, అంజలీదేవి, రేలంగి తదితర నటీనటులతో పరిచయం ఏర్పడింది. అనంతరం ఆయన ఫైర్ ఆఫీసర్ గా బందరు, విజయనగరం పట్టణాల్లో విధులు నిర్వర్తించారు.

ఈ క్రమంలోనే ఆయన ఎంఎస్సీలో చేరాలా లేక సినిమా రంగంలో నటుడిగా స్థిరపడిపోవాలా అని ఆలోచిస్తున్న సమయంలోనే ఆయన బంధువు బీ.వి రామానందం గారు తాను తీయబోయే సినిమాలో అవకాశం కల్పించారు. ఆ సినిమా పేరు వరూధిని, రంగారావు గారు వెంటనే ఉద్యోగం మానేసి సినీ రంగంలో ప్రవేశించేందుకు గాను మద్రాస్ పయనమయ్యారు. వరూధిని అనుకున్నంత విజయం సాధించలేదు. ఆ తరువాత ఆయనకు సినిమాలపై విసుగొచ్చి జంషెడ్ పూర్ లోని టాటా సంస్థలో కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. ఈ నేపథ్యంలోనే లీలావతి అనే ఆవిడను 27 డిసెంబర్ 1947లో వివాహం చేసుకున్నారు.

తదుపరి రోజుల్లో ‘పల్లెటూరిపిల్ల’ అనే చిత్రంలో విలన్ గా నటించటానికి బీ.ఏ సుబ్బారావు నుంచి ఆహ్వానం వచ్చింది. అయితే, షూటింగ్ చెన్నై బయలుదేరుతుండగా తన తండ్రి చనిపోయాడని వార్త అందింది. దీంతో ఆ కార్యక్రమాలు పూర్తి చేసే సరికి ఆ అవకాశం మరొకరికి వెళ్లింది. అనంతరం నాగిరెడ్డి, చక్రపాణి కలిసి విజయా ప్రొడక్షన్స్ నిర్మాణంలో ‘షావుకారు’ సినిమాలో ఓ కీలకమైన పాత్రను అనూహ్యంగా రంగారావుకి దక్కింది. ఆ సినిమాలో ఆయన నటన ఆశేష ఆంధ్రులను అమితంగా ఆకట్టుకుంది.

ఆయన నటన మీద ఉన్న నమ్మకంతో అదే సంస్థలో వారు నిర్మించిన పాతాళ భైరవి సినిమాలో మాంత్రికుడి పాత్రను రంగారావుకు ఇచ్చారు. ఆ పాత్రతో తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు తమిళ, హిందీ చిత్రాల నిర్మాతలు రంగారావు డేట్స్ కోసం క్యూ కట్టారు. భారతదేశం నుంచి తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడి అవార్డు పొందిన వ్యక్తిగా ఎస్వీఆర్ గుర్తింపు పొందారు. అలా ఆయన భారతీయ చలనచిత్ర రంగంలో చెరగని ముద్ర వేశారు. అప్పటి నుంచి ఆయన విజయ సంస్థ వారికి ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్ర, రేలంగి తదితర నటుల లాగా ఆస్థాన నటులుగా ఉండిపోయారు. 1974 జూలై 18న ఆయన తుది శ్వాస విడిచారు, జనం గుండెల్లో మాత్రం సజీవంగా ఇప్పటికే నిలిచే ఉన్నారు.

Read More: జాతకాలను నమ్మడం మొదలెట్టిన హీరో ప్రభాస్.. అందుకే అలాంటి పని చేస్తున్నాడా..?

Advertisement

Next Story

Most Viewed