సెర్చ్ ఆపరేషన్.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్

by Sridhar Babu |
సెర్చ్ ఆపరేషన్.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: 118 క్రిమినల్ కేసులు.. హైదరాబాద్‌లోనే 100 చైన్ స్నాచింగ్‌లు.. నాలుగు రాష్ట్రాల్లో పీడి యాక్ట్‌ నమోదు.. ఇది భాకర్ అలీ నేర చరిత్ర.. కరెక్ట్‌గా చెప్పాలంటే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఇతడి కోసం వందల సీసీ ఫుటేజీలను పరిశీలించిన ఫలితం లేకుండా పోయింది. నాలుగు రాష్ట్రాల పోలీసులకు సవాల్‌గా మారిన ఇతడు ఎట్టకేలకు చిక్కాడు. ఇతడిని అరెస్ట్ చేసిన విధానం ఒక ఎత్తు అయితే, ఇతడి కోసం పోలీసులు చేసిన సాహసం ఖాకీ సినిమాను తలపిస్తోంది.

భాకర్ అలీ వృత్తిరీత్యా చైన్ స్నాచర్. చైన్‌ స్నాచింగ్‌నే వృత్తిగా మలుచుకున్న అతడు పోలీసులకు సవాల్‌గా మారాడు. వరుస దొంగతనాలతో రెచ్చిపోయాడు. జిల్లాలు, రాష్ట్రాలు దాటి మరీ దొంగతనాలు చేసేవాడు. ఈ నేపథ్యంలోనే పలుసార్లు పట్టుబడ్డ భాకర్‌పై తెలంగాణ, ఏపీ, కర్నాటక రాష్ట్రాల పోలీసులు నాలుగు సార్లు పీడియాక్ట్‌ కూడా నమోదు చేశారు. అయినా అతడి బుద్ధి మారలేదు. జైలు నుంచి విడుదల అయినా కొద్ది రోజులకే మళ్లీ చైన్ స్నాచింగ్‌లకు దిగాడు. ఇక లాభం లేదు అనుకున్న తెలంగాణ, కర్ణాటక పోలీసులు భాకర్‌కు చెక్ పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సీపీ ఆదేశాలతో కరీంనగర్‌ పోలీసులు ఆపరేషన్‌కు సిద్ధం అయ్యారు.

ఈ ఆపరేషన్ ఒకటి రెండ్రోజుల పాటు సాగింది కాదు.. ఏకంగా 45 రోజు ఎన్నో ఒడిదుడుకుల నడుమ సాగింది. ముఖ్యంగా 45 రోజుల పాటు కరీంనగర్ పోలీసులు పెద్ద సాహసమే చేశారు. నవీ ముంబై, హైదరాబాద్, బెంగళూరు, షోలాపూర్‌, బీదర్ ప్రాంతాల్లో మొదలైన సెర్చ్ ఆపరేషన్‌ చేశారు. ఈ నేపథ్యంలో నిందితుడి ఆచూకీ తెలుసుకొని షోలాపూర్‌లో పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఎదురుదాడి చేసిన భాకర్ అలీ తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడు.

ఈ క్రమంలోనే షోలాపూర్‌లో మొదలైన చేజింగ్‌ పూణే వరకు సాగింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎట్టకేలకు నిందితుడు దొరికాడనుకున్న పోలీసులకు భాకర్ అలీ మళ్లీ షాక్ ఇచ్చాడు. ఎదురుదాడికి దిగాడు. ఈ దాడిలో పోలీసులకు కూడా గాయాలు అయ్యాయి. అయినప్పటికీ అతడి ఆట కట్టించాలని వచ్చిన కరీంనగర్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నిందితుడిని కటకటాల్లోకి నెట్టారు. శభాష్ పోలీస్ అనిపించుకున్నారు. దీంతో ఆపరేషన్‌లో పాల్గొన్న సిబ్బందిని కరీంనగర్ సీపీ అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed