అనుభవం ఉన్నా ఆ పదవి అసంభవం?

by Sridhar Babu |   ( Updated:2020-03-13 06:21:16.0  )
అనుభవం ఉన్నా ఆ పదవి అసంభవం?
X

దిశ, కరీంనగర్:
ఒకసారి ఎమ్మెల్యే.. ఆరుసార్లు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం.. దశాబ్దాలుగా పార్టీ వెన్నంటి ఉన్న నైజం.. కానీ పార్టీ దృష్టిలో ఇవేవీ అర్హతలు కాలేక.. అలంకారప్రాయంగానే మిగిలాయి. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నా.. ఆయన మాత్రం ప్రస్తుతం నిమిత్తమాత్రుడిగానే మిగిలిపోవాల్సి వచ్చింది. ఈ మాటలు వినేందుకు కాస్త చేదుగా ఉన్నా.. ఇది చరిత్ర చెప్పిన నిజం ! ఇదంతా.. భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో రాష్ట్రంలోనే సీనియర్ నేతగా ఉన్న గుజ్జుల రామకృష్ణారెడ్డి గురించే అంటే నమ్మక తప్పదు.

తెలంగాణలో బీజేపీ సీనియర్ల సరసన ఉండాల్సిన గుజ్జుల రామకృష్ణారెడ్డి ఊసే లేకుండా పోయింది. పార్టీలో వివిధ బాధ్యతలు నిర్వర్తించిన గుజ్జుల ఓసారి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. ఆరుసార్లు పార్టీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. అయినా ఆయన పేరు రాష్ట్ర అధ్యక్ష పదవికి అసలు పరిశీలనకే రాలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో బండి సంజయ్‌తో పాటు, పార్టీలో కొత్తగా చేరిన డీకే అరుణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్లు ప్రతిపాదనకు వచ్చినా.. చివరకు అధ్యక్ష పదవి ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం ఉన్న బండి సంజయ్‌ను వరించిన సంగతి తెలిసిందే.

గుజ్జుల పార్టీలో కీలక పదవులు అందిపుచ్చుకున్నా.. తనచుట్టూ ఏర్పరచుకున్న కోటరీ దాటకపోవడమే ఆయన పేరు పరిశీలనలో లేకపోవడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే ఎక్కువగా పరిమితమై తన రాజకీయ భవిష్యత్తుకు తానే ప్రతిబంధకాన్ని సృష్టించుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా బీజేపీలో నెలకొన్న గ్రూపు రాజకీయాల ప్రభావమూ గుజ్జులపై తీవ్రంగా పడిందన్న వారూ లేకపోలేదు. గ్రూపు రాజకీయాలను పెంచిపోషించే వారితో జతకట్టడం కూడా ఆయనకు ప్రతికూలంగా మారిందన్న అభిప్రాయాలూ వ్యక్తవుతున్నాయి. ఏదేమైనా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఆరుసార్లు బాధ్యతలు నిర్వహించిన గుజ్జుల.. ప్రస్తుతం పార్టీలో ఏ పదవీ లేకుండా నిమిత్తమాత్రుడిగా ఉండటం మాత్రం విస్మయానికి గురిచేస్తోంది.

Tags: BJP, Gujjula Ramakrishna Reddy, State President, MLA, Vice President

Advertisement

Next Story

Most Viewed