నెగెటివ్ వచ్చింది.. బిడ్డను వదిలేసి తల్లిని ఎత్తుకెళ్లారు..!

by Anukaran |
rape case
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా నుంచి కోలుకొని ఇంటికెళ్తున్న మహిళపై అత్యాచారం చేశారు కామాంధులు. 54 ఏండ్ల వృద్ధురాలు అని చూడకుండా చొట్ల పొదల్లోకి ఎత్తుకుపోయి నరకం చూపించారు. ఈ దారుణ ఘటన మే 27న అసోంలో వెలుగుచూసింది. అసోంలోని సపేకాతీ మోడల్ హాస్పిటల్‌లో ఇటీవల కరోనా సోకడంతో ఓ మహిళ అడ్మిట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే చికిత్స తీసుకున్న ఆమె కరోనా నుంచి కోలుకుంది. నెగెటివ్ రావడంతో మే 27న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కాగా, ఆ ఆస్పత్రి నుంచి వారి ఇళ్లు 30 కిలో మీటర్ల దూరంలో ఉంది. చేతిలో చిల్లిగవ్వలేదు అని చెప్పినా హాస్పిటల్ సిబ్బంది అంబెలెన్స్‌ను ఆరేంజ్ చేయలేకపోయారు.

దీంతో చేసేదేమి లేక కాలినడకన ఇంటి బాట పట్టారు ఆ మహిళ. ఆమెకు తోడుగా 17 ఏండ్ల కూతురు కూడా ఉంది. సపేకాతీ మోడల్ హాస్పిటల్‌ నుంచి బోర్హాట్ టీ ఎస్టేట్ వద్దకు రాగానే చీకటి పడింది. ఇదే సమయంలో ఇద్దరు దుండగులు అడ్డుతగిలారు. తల్లి కూతుర్లను బెదిరించారు. చెట్ల పొదల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా కూతురు (17) తప్పించుకుపోయింది. కానీ, ఆ కామాంధులు తల్లిని మాత్రం వదల్లేదు. బలవంతంగా టీ గార్డెన్‌‌లోకి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు.

భయంతో పరుగులు పెట్టిన కూతురు ఓ గ్రామానికి చేరుకొని అక్కడ ఉన్న స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించింది. దీంతో తల్లి కోసం వెతుకులాట ప్రారంభించారు. చివరకు అత్యాచారానికి గురైన బాధితురాలు అత్యంత దారుణ పరిస్థితుల్లో కనిపించింది. ముగ్గురు కూతుర్లు ఉన్నారు.. వారిని నేనే పోషించాలి.. దయచేసి నన్ను వదిలేయండి అంటూ బతిమాలిన వదల్లేదని బాధితురాలు గుండెలు బద్దలయ్యేలా ఏడ్చింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చరైదేవ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుధాకర్ సింగ్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed