అభిమానులు అర్ధం చేసుకోండి : మోహన్ బాబు

by Shyam |
అభిమానులు అర్ధం చేసుకోండి : మోహన్ బాబు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆరోగ్యమే మహాభాగ్యం అన్న పెద్దల మాటలను దృష్టిలో పెట్టుకుని ఆత్మీయ విన్నపం చేశారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకుని మార్చి 19న తన పుట్టినరోజు వేడుకలతో పాటు శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల వార్షికోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 1992 నుంచి తన జన్మదినాన్నే శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల వార్షికోత్సవంగా జరుపుకుంటూ… పిల్లల కళ్లలో ఆనందాన్ని భగవంతుని ఆశీస్సులుగా భావిస్తూ వస్తున్నానని తెలిపారు. శాస్త్రవేత్తలు, విజ్ఞానులు, మేధావులు, కళాకారులను పిలిపించి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు ప్రయత్నించానని తెలిపారు. కానీ కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వేళ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

పంచ భూతాలు మనకిచ్చిన వరాలను మనమే శాపాలుగా మార్చుకున్నామని.. తద్వారా వినాశనాన్ని కొని తెచ్చుకుని ప్రాణాలమీదకు తెచ్చుకున్నామన్నారు మోహన్ బాబు. అందుకే గాలి కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రజలు గుంపులు గుంపులుగా ఉన్నప్పుడు ఒకరి నుంచి మరొకరికి వ్యాధి సంక్రమించే ప్రమాదం ఉందని… కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికలను పాటించాలని సూచించారు. అందరూ బాగుండాలనే సిద్ధాంతంతో నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని సహృదయంతో అర్ధం చేసుకోవాలని కోరారు. నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ఇంత దూరం అభిమానులు రావొద్దని సూచించారు. మీ అభిమానమే కొండంత అండ… మీ ఆశీస్సులే శ్రీరామ రక్ష అని… ‘శార్వరి నామ’ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు మోహన్ బాబు. ఈ తెలుగు కొత్త సంవత్సరం మీ జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుంటున్నానని తెలిపారు.

tags : Collection King, Mohan Babu, Sri Vidya Niketan Education Institutions, Birthday Celebration

Advertisement

Next Story