మోడ్రన్ గురూస్… ఆయనో రకం.. ఈయనో రకం!

by Sujitha Rachapalli |   ( Updated:2021-02-17 04:26:56.0  )
మోడ్రన్ గురూస్… ఆయనో రకం.. ఈయనో రకం!
X

దిశ, ఫీచర్స్: జీవితం చాలా చిన్నదే కానీ, నిత్యం వేల సందేహాలు మనల్ని తొలిచేస్తుంటాయి. ఇక్కడ మన మదిలో మెదిలే ఆలోచన చిన్నదా? పెద్దదా? అన్నది సమస్య కాదు! దానికి సరైన పరిష్కారం ఎంచుకోవడమే ఓ పెద్ద సవాల్. అందరూ తప్పు చేసేవాళ్లే, అందరిలోనూ భయాలుంటాయి. కానీ తప్పులను సరిదిద్దుకుంటూ, భయాలను అధిగమిస్తూ, జీవితాన్ని ఆనందమయంగా తీర్చిదిద్దుకోవడమే మన బాధ్యత. ఈ క్రమంలోనే పాతికేళ్ల జీవిత చౌరస్తాలో నిలబడి ఎటు వెళ్లాలో తేల్చుకోలేకపోతున్న ఓ నిరుద్యోగికి.. సరైన మార్గం కావాలి. గుంపులో గోవిందలా రెగ్యులర్ కోర్సుల వెంట పరుగులు తీసే విద్యార్థికి.. తనలోని శక్తి ఏంటో తెలియాలి. చిన్న చిన్న విషయాలకే ‘డిప్రెషన్’కు గురై జీవితాన్ని బలితీసుకునే నిరాశవాదులకు.. లైఫ్ విలువేంటో అర్థమవ్వాలి. ఇవేకాదు అసలు జీవితంలో నిజమైన ఆనందాన్నిచ్చేవి ఏవి? బంధాలు, అనుబంధాలను ఎలా కాపాడుకోవాలి? ఈగోను ఎలా వదిలిపెట్టాలి? ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలి? ఓటమి నుంచి గెలుపు దిశగా ఎలా ప్రయాణించాలి? కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి? ప్రేమను ఎలా పంచాలి? వంటి ఎన్నో విలువైన విషయాలకు ఇప్పుడు కేరాఫ్ అడ్రస్‌గా కనిపిస్తున్న మోడ్రన్ మాంక్స్‌(మోటివేషనల్ స్పీకర్స్)పై స్పెషల్ స్టోరీ..

మనం చేస్తున్న పొరపాట్లను మనసు నొప్పించకుండా చెప్పడమే ఈ మోటివేషనల్ స్పీకర్స్ ప్రత్యేకత. తమదైన విశ్లేషణలతో ఎంతో మంది గురువులు లైఫ్ లెస్సన్స్ చెబుతుండగా.. వారిలో గౌర్ గోపాల్ దాస్, సద్గురు, గరికపాటి నరసింహారావు ముందు వరుసలో ఉన్నారు.

గౌర్ గోపాల్ దాస్ :

నునుపైన గుండు, నుదుటున మూడు నామాలతో పాటు గోపాల్ దాస్ ధరించిన కాషాయ వస్త్రాలు చూస్తే.. ఆ సన్యాసి చెప్పింది మనం వినాలా? అనే ఆలోచన రావొచ్చు. కానీ ఒక్కసారి అతడు చెప్పే సందేశాలను వింటే లేదా మోటివేషన్ వీడియోలను చూస్తే మాత్రం ‘ఇన్‌స్పిరేషన్’ తన్నుకొస్తుంది. అందుకే అతడికి యూత్ ఫాలోయింగ్ ఎక్కువ. ఓ చిన్న కథ, ఆ క్రమంలో చిట్టిపొట్టి క్రాకింగ్ జోక్స్, చివరకు ఓ గొప్ప సందేశంతో ముగింపు.. టూకీగా ఆయన ప్రజెంటేషన్ ఇంతే. కానీ ఆ నాలుగు నిమిషాల కథే.. జీవితానికి సరిపడా విలువలను, ధైర్యాన్ని అందిస్తుంది. ఫియర్‌లెస్ చైల్డ్, రివల్యూషనరీ టీన్, ఇర్రెలెవెంట్ యూత్‌తో పాటు కోట్లాదిమంది ఆయన సందేశాలతో వాళ్ల జీవితాన్ని మార్చుకుని, ఆనందాన్ని పొందుతున్నారు. ఈ క్రమంలో అతడి యూట్యూబ్ చానల్‌కు 3.42 మిలియన్స్ సబ్‌స్కైబర్స్ ఉండగా, ఇన్‌స్టా అకౌంట్‌కు 2.72 మిలియన్, ఫేస్‌బుక్‌కు 6.2 మిలియన్, ట్విట్టర్ 87 కె ఫాలోవర్స్ ఉన్నారు. కాగా ఇప్పటికే తన యూట్యూబ్ వీడియోలు 500 మిలియన్ వ్యూస్ అందుకోవడం విశేషం.

ఎలక్ట్రికల్ ఇంజనీర్‌ చేసిన గౌర్ గోపాల్ దాస్.. కొంతకాలం ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ‘హ్యూలెట్ ప్యాకర్డ్’(హెచ్‌పీ)లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత 1996లో ఇస్కాన్‌లో చేరి సన్యాసం పుచ్చుకున్న దాస్.. పాతికేళ్లుగా తన మోటివేషన్ స్పీచ్‌లతో దేశ, విదేశాల్లోని ఎంతోమంది జీవితాల్లో స్ఫూర్తినింపాడు. ఈ క్రమంలోనే గూగుల్, సేల్స్ ఫోర్స్, ఇన్ఫోసిస్, బార్క్లేస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఇ అండ్ వై, ఫోర్డ్ కంపెనీల్లో రెగ్యులర్‌గా తన మోటివేషనల్ స్పీచెస్ ఇస్తుంటాడు. పలు రంగాల్లోని అగ్రశ్రేణి ప్రముఖులతో పాటు కార్పొరేట్ నాయకులకు మార్గనిర్దేశం చేస్తాడు. 2016 లండన్ పర్యటన సందర్భంగా బ్రిటిష్ పార్లమెంటులో ప్రసంగించారు. ఇంత చిన్న వయస్సులో ప్రపంచానికి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించడంలో ఆయన చేసిన కృషికి భారత విద్యార్థి పార్లమెంటు-ఎంఐటీ ఇటీవలే ‘ది ఐడియల్ యంగ్ స్పిరిచువల్ గురు అవార్డ్’ ఇవ్వగా, కేఐఐటీ విశ్వవిద్యాలయం అతనికి ‘దాన్‌‌వీర్ కర్ణ అవార్డు’తో సత్కరించింది.

సద్గురు :

‘ఇషా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్‌ను అందరూ ‘సద్గురు’గా అభిమానిస్తారు. గుబురు గడ్డంతో కనిపించే ఆయన మోముపై ఎప్పుడూ చిరునవ్వు నాట్యమాడుతూనే ఉంటుంది. చూడ్డానికి సాధువులా కనిపించినా, ఆయన లైఫ్‌స్టైల్ మాత్రం విభిన్నం. బైక్‌పై లాంగ్ డ్రైవ్స్.. గోల్ఫ్, ఫుట్‌బాల్ ప్లేయింగ్‌, ఏరోప్లేన్స్ డ్రైవింగ్, ఒంటరిగా ట్రెక్కింగ్ వంటి హాబీస్ ఆయనను మోడ్రన్‌గా చూపిస్తే.. నదీ ప్రాంతాల్లో సంచారం, ప్రకృతి ఒడిలో సేదతీరుతూ పరవశాన్ని పొందడం, శివుడి పాటలపై తన్మయత్వంతో డ్యాన్స్ చేయడం వంటివన్నీ ఆయనలోని ఆధ్యాత్మిక కోణాన్ని ప్రతిబింబిస్తుంటాయి. అందుకే తనను ‘కూలెస్ట్ గురు ఇన్ ది వరల్డ్’ అంటుంటారు. అన్నింటికంటే మించి ఎన్నో సందేహాలకు సద్గురు ఇచ్చే సైంటిఫిక్‌ సమాధానాలు ప్రతీ మనిషిని ప్రభావితం చేస్తాయి. నెగటివ్ థాట్స్‌ను ఎలా తొలగించుకోవాలి? నువ్వు ఎందుకు సక్సెస్ కావడం లేదు? అజ్ఞానం ఆనందమిస్తున్నప్పుడు విజ్ఞానం ఎందుకు? దిష్టి తీసుకోవడం వల్ల లాభముంటుందా? అసలు ఇలాంటివి నమ్మొచ్చా? వంటి ఎన్నో విషయాలతో కూడిన వీడియోలను ఆయన యూట్యూబ్ చానల్‌లో చూడొచ్చు. సద్గురు చానల్‌కు 6.67 మిలియన్ సబ్‌స్కైబర్స్ ఉండగా.. ఎఫ్‌బీలో 7.7 మిలియన్స్, ఇన్‌స్టాలో 4.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. విదేశీ సెలెబ్రిటీలు, ప్రముఖులు కూడా ఆయన్ను ఫాలో అవుతుండగా ‘ప్రపంచ యోగా గురువు’గా పేరు పొందారు సద్గురు.

డాక్టర్ కొడుకైన వాసుదేవ్.. ఇంగ్లీష్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేశాడు. పాతికేళ్ల వయసులో జీవితాన్వేషనలో భాగంగా దేశమంతటా పర్యటించాడు. ఈ క్రమంలోనే తన ఇన్నర్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకునేందుకు 1982లో తన సొంతూరు మైసూరులోనే తన మొదటి యోగా తరగతిని నిర్వహించాడు. 1992లో ఇషా ఫౌండేషన్ స్థాపించగా, ప్రస్తుతం ఇందులో 11 మిలియన్ల వలంటీర్లు పనిచేస్తున్నారు. ‘ప్రాజెక్ట్ గ్రీన్‌హ్యాండ్స్, ర్యాలీ ఫర్ రివర్స్’ క్యాంపెయిన్స్ ద్వారా చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్న సద్గురు.. ఇందులో భాగంగా భారతదేశ నదీ పరీవాహక ప్రాంతాల్లో 50 బిలియన్ చెట్లను నాటాలని కోరుకుంటున్నాడు.

గరికపాటి నరసింహారావు :

సహస్ర అవధానిగా పేరుపొందిన గరికపాటి నరసింహారావు తెలుగువాళ్లకు సుపరిచితుడే. ఈయన మాంక్ కాదు కానీ.. కాస్త చమత్కారం, ఇంకాస్త వ్యంగ్యం కలగలసిన ‘గరికపాటి మాట.. ఓ సందేశాత్మక తూటా’ అంటే అతిశయోక్తి కాదు. సున్నితమైన అంశాలపై గరికపాటి విసుర్లు, పలుమార్లు విమర్శలు కూడా ఎదుర్కొన్నా వాటిని చాలెంజ్ చేయగల విద్వత్తు ఆయన సొంతం. లాభాపేక్ష కోసం ‘భక్తి’ పేరిట జరుగుతున్న ‘కోటి దీపార్చన’ ‘లక్ష పుష్పార్చన’ వంటి పూజా కార్యక్రమాలను సైతం ఆయన బాహాటంగానే తప్పుపడతాడు. తప్పుదారి పడుతున్న యువతను హెచ్చరిస్తాడు. కొడుకు ధర్మాన్ని, కోడలి బాధ్యతలను, అన్నదమ్ముల అనుబంధాలను సున్నిత హాస్యంతో కనువిప్పు కలిగేలా చెబుతాడు. పురాణాల ప్రాశస్త్యం ఏమిటి? మన సంస్కృతి సంప్రదాయాల ప్రాముఖ్యత? తెలుగు భాష గొప్పదనాన్ని వివరిస్తాడు. నిజమైన ఆనందాన్ని, అసలైన సంపదను, హాయిగా నిద్రపోయే మార్గాన్ని సూచిస్తాడు. చిన్నారుల నుంచి పండుముసలి వరకు అందరికీ ఆమోదయోగ్యమైన విషయాలను ఆరోగ్యకరమైన హాస్యంతో చెప్పే గరికపాటి వీడియోలు ఈ తరానికే కాదు, రాబోయే తరానికి కూడా ఎంతో ఉపయోగకరం.

గరికపాటి నరసింహారావు అవధానిగా సుప్రసిద్ధుడు. సుమారు 275 అష్టావధానాలు, 8 అర్థశత, శత, ద్విశత అవధానాలు, ఒక మహా సహస్రావధానాన్ని దిగ్విజయంగా నిర్వహించాడు. మొదటి అవధానం 1992 సంవత్సరం విజయదశమి రోజు చేయగా, 2009లో 8 కంప్యూటర్లతో హైటెక్ అవధానం నిర్వహించాడు. ఇండియాలోనే కాకుండా అమెరికా, సింగపూర్, మలేషియా, లండన్, దుబాయి, బహ్రెయిన్, కువైట్, అబుదాభి, దుబాయి, ఖతార్ మొదలైన దేశాల్లో పర్యటించి అక్కడ కూడా అవధానాలతో మెప్పించాడు. ఈ క్రమంలో ఎన్నో పురస్కారాలు, బిరుదులు అందుకున్నాడు.

జీవితంలో.. ఆగిపోయినా, అలసిపోయినా, ఆవేశపడినా, అభద్రతకు లోనైనా, ఒత్తిడికి గురైనా, ఓటమి పాలైనా ఒక్కసారి ఈ మోటివేషనల్ వీడియోలు చూస్తే ఆటోమేటిక్‌గా రీచార్జ్ అవుతాం. అంతేకాదు విలువైన జీవితపు అర్థాన్ని తెలుసుకుంటాం. అపార జ్ఞానాన్ని సొంతం చేసుకుంటాం.

Advertisement

Next Story

Most Viewed