రహస్యాలు చెవిలోనే చెప్పండి.. సెల్‌ఫోన్‌లో వద్దు

by Anukaran |   ( Updated:2021-02-25 06:13:03.0  )
రహస్యాలు చెవిలోనే చెప్పండి.. సెల్‌ఫోన్‌లో వద్దు
X

దిశ, శేరిలింగంపల్లి: గోడలకు చెవులుంటాయి జాగ్రత్త సుమీ. ఎవరైనా విన్నారంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేవారు పెద్దలు. గోడలకు చెవులుంటాయో లేదో కానీ జేబుల్లో ఉన్న సెల్ ఫోన్‎ల్లో మాత్రం కాల్ రికార్డర్ ఉంటుంది.. తస్మాత్ జాగ్రత్త. ఎవరు ఏం మాట్లాడాలన్న, ఏం చెప్పాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిందే. కాదూ మేము నోటికి వచ్చింది మాట్లాడేస్తాం. అంటే మీ నోటి నుండి జారిన ఒక్కమాట మీ వ్యక్తిగత జీవితాన్ని, ప్రతిష్టను బజారున పడేసే ఛాన్స్ ఉంది. ఈమధ్యకాలంలో జరుగుతున్న వరుస ఘటనలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. తాజాగా సింగరేణి ఉద్యోగి, బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఇలా ఎంతోమంది నాయకులు, అధికారుల వాయిస్ రికార్డులు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఫోన్ ఎఫెక్ట్స్..

సెల్‌ఫోన్స్ చేతిలోకి వచ్చాక ప్రతీది ఈజీ అయిపోయింది. అడుగుతీసి అడుగు వేయకుండానే అన్ని పనులు చక్కబెట్టేస్తున్నారు. అంతేకాదు మాటలు కూడా ఇంకా ఎక్కువయ్యాయి. ఫోన్ పట్టుకుని గంటల తరబడి ముచ్చట్లు పెట్టేస్తున్నారు. అవసరం ఉన్నది, లేనిది అన్నీ మాట్లాడేస్తున్నారు. పెద్దా చిన్నా అనే తేడాలేకుండా ఈ ముచ్చట్లలో మునిగితేలుతున్నారు. అయితే మంచి వరకు ఓకే. కానీ చెప్పరాని, చెప్పుకోలేని ముచ్చట్లను సైతం ఇదే ఫోన్లలో ముచ్చటిస్తున్నారు. ఇదే ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారుతోంది. అవసరానికి కాకుండా అనవసర విషయాలకు మొబైల్స్‌ను యూజ్ చేస్తున్న ఘటనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

వాయిస్ రికార్డర్‌తో

స్మార్ట్ ఫోన్‌లలో ఉన్న వాయిస్ రికార్డర్‌తో మంచికన్నా చేడే ఎక్కువగా జరుగుతుంది అనడంలో సందేహం లేదు. ఈమధ్యకాలంలో జరుగుతున్న ఘటనలు ఇదే విషయాన్ని ప్రూవ్ చేస్తున్నాయి. ప్రతీ విషయానికి సెల్ రికార్డర్ ఆన్ చేసేస్తున్నారు. అందులో మాట్లాడే ప్రతీమాట రికార్డ్ చేస్తున్నారు. ఎదుటివారి గూర్చి మంచి మాట్లాడితే ఓకే. కానీ అనుకోకుండా ఏదో ఒక్కమాటతోనే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, కొలీగ్స్, అయ్యర్ ఆఫీసర్స్ గూర్చి ఏదో ఓసందర్భంలో చెడుగా మాట్లాడి జాబ్స్ పోగొట్టుకున్నవారు, స్నేహితులను కోల్పోయిన వారూ చాలామంది ఉన్నారు. ఇది వరకు మందు తాగినప్పుడో, ఇంకేదో విషయంలో ఏమన్నా లైట్ అనుకునే వారు.

కానీ, ఈ సెల్ ఫోన్స్ వచ్చాక ప్రతీ విషయం సీరియస్ అయ్యింది. ఎవరినీ ఏమన్నా క్షణాల్లో మాటలు కోటలు కాదు ఏకంగా దేశాలే దాటేస్తున్నాయి. ఇలా దేశాధినేతలు మాట్లాడిన మాటలు కూడా కొన్ని సందర్భాల్లో వైరల్ అయినవి కూడా ఉన్నాయి. కానీ ఒక్కసారి వాయిస్ రికార్డ్ అయితే చాలు మాట్లాడింది. ఎవరూ.. ఏ సందర్భంలో మాట్లాడారు అనే విషయం పూర్తి ఆధారాలతో దొరికేస్తుంది. మేము ఆమాటలు అనలేదు అని ఎంత మొత్తుకున్నా ప్రయోజనం ఏం ఉండదు.

ఎన్నెన్నో యాప్స్..

స్మార్ట్ ఫోన్స్‌లో ఇన్ బిల్ట్‌గా వాయిస్ రికార్డర్ ఉంటుంది. ఇదే కాకుండా ఎక్స్ ట్రాగా వాయిస్ యాప్స్ కూడా ఇన్స్టాల్ చేసుకుంటున్నారు కొందరు. వీటితో వాయిస్‌లో స్పష్టత ఉండడంతో పాటు ప్రతీ మాట బాగా వినిపిస్తోంది. దీంతో ఎదుటివారి గూర్చి ఏదో తప్పుగా మాట్లాడి తప్పించుకునే ఛాన్స్ ఉండదు. ఆండ్రాయిడ్ ప్లే స్టోర్, యాపిల్, బ్లాక్ బెర్రీస్ లాంటి సంస్థలు ఇలాంటి యాప్స్‌ను ఇంప్రూవ్ చేస్తున్నాయి. ఆయా ప్లాట్ ఫామ్స్‌లో ఎన్నో యాప్స్ ఇప్పుడు యూజర్లకు అందుబాటులో ఉన్నాయి.

తస్మాత్ జాగ్రత్త..

నిజానికి చెప్పాలంటే ఫోన్ లే ఇప్పుడు అతిపెద్ద గూఢచారుల పాత్ర పోషిస్తున్నాయి అనడంలో సందేహమే లేదు. ఫోన్ల ద్వారా వాయిస్ రికార్డ్, వీడియో రికార్డ్ లతో స్టింగ్ ఆపరేషన్స్ చేసి అధికారుల పదవులను, రాజకీయ నేతల భవిష్యత్ ను నేలకూల్చిన తాఖీదులు ఉన్నాయి. ఎన్నో ఘటనలకు ఫోన్లు, వాయిస్ రికార్డర్ లు సాక్షాలుగా పరగణిస్తున్నాయి కోర్టులు.. సో తస్మాత్ జాగ్రత్త.. మన దగ్గర లేని వారిగూర్చి చిన్నమాట మాట్లాడలనుకున్నా ఆచితూచి మాట్లాడడం మర్చిపోకండి. లేదంటే పెద్ద శిక్షను అనుభవించాల్సి వస్తుంది.

Advertisement

Next Story