అయ్యా.. నీవే దిక్కు.. ఎమ్మెల్యే రసమయి కాళ్లపై పడి..

by Sridhar Babu |
MLA Rasamayi
X

దిశ, మానకొండూరు: ‘‘అయ్యా.. నాకు ప్రాణ భయం ఉంది. కాపాడండి. నా భూమి పైకి కొందరు వ్యక్తులు అక్రమంగా వచ్చి దున్నుకోవడంతోపాటు నన్ను చంపేందుకు యత్నించారు. నన్ను మీరే రక్షించాలి’’ అంటూ మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాళ్లపై పడి ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు ఆడెపు నరసయ్య వేడుకున్నాడు. శుక్రవారం తాటికల్ గ్రామ పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే రసమయికి ఈ ఘటన ఎదురైంది. ఇంతకూ ఏం జరిగిందంటే..

తాడికల్ గ్రామానికి చెందిన ఆడెపు నరసయ్య పక్క గ్రామమైన ముత్తారం శివారులో 205/39/5 సర్వే నంబర్‌లో 2.15 ఎకరాల వ్యవసాయ భూమిని 2008 సంవత్సరంలో కొనుగోలు చేశాడు. ఆ భూమికి నూతన రెవెన్యూ చట్టం ప్రకారం రెవెన్యూ అధికారులు డిజిటల్ పట్ట పాసు బుక్కు కూడా జారీ చేశారు. అయితే ముత్తారం గ్రామానికి చెందిన నేలవేణి బుచ్చయ్య, కనకం చిన్న వీరయ్య, నరేష్, భద్రయ్య, వేముల వీరయ్య, రాధ, కదిరే ఐలయ్య తన వ్యవసాయ భూమిని ట్రాక్టర్‌తో అక్రమంగా దున్నడంతోపాటు తనను చంపేందుకు ప్రయత్నించారని ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నాడు. వారితో తనకు ప్రాణభయం ఉందని, కాపాడాలని వేడుకున్నాడు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే బాలకిషన్ తహసీల్దార్ గూడూరి శ్రీనివాసరావు, కేశవపట్నం ఎస్ఐ ప్రవీణ్ రాజుకు ఫోన్ చేసి మాట్లాడారు. బాధితుడు నర్సయ్యకు న్యాయం చేయాలని ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed